శాంతి చర్చలకు మేం ఎప్పుడూ సిద్ధమే...కేంద్రం సిద్ధమో.. కాదో స్పష్టం చేయాలి

శాంతి చర్చలకు మేం ఎప్పుడూ సిద్ధమే...కేంద్రం సిద్ధమో.. కాదో స్పష్టం చేయాలి
  • మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ లేఖ

భద్రాచలం, వెలుగు: శాంతి చర్చల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి తమ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని.. చర్చలకు మోదీ సర్కారు సిద్ధంగా ఉందా? లేదా? స్పష్టం చేయాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్​డిమాండ్​ చేశారు. బుధవారం అభయ్​ పేర ఓ లేఖ రిలీజ్​చేశారు. 

ఆపరేషన్ కగార్​నిలిపివేసి.. ఇదివరకే కాల్పుల విరమణ ప్రకటించి, శాంతి చర్చలు జరపాలని ఏప్రిల్ 25న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ తమ పార్టీ కేంద్ర కమిటీ తరఫున లేఖ రాసినట్టు గుర్తు చేశారు. తమ  లేఖపై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే.. కేంద్ర ప్రభుత్వం, చత్తీస్​గఢ్​సర్కారు వ్యతిరేకంగా స్పందించాయన్నారు. 

తెలంగాణ, చత్తీస్​గఢ్​తోపాటు దాదాపు 16 రాష్ట్రాల్లో పార్టీ పనిచేస్తోందన్నారు. చర్చల విషయంలో అమిత్​షా స్పందించాలన్నారు. ఆపరేషన్ కగార్ పేరిట తమ పార్టీ కేడర్​ను, ఆదివాసీలను హత్య చేస్తున్నారని అభయ్ ఆరోపించారు. వివిధ  పార్టీలు, ప్రజాసంఘాలు శాంతిచర్చలకు అనుకూలమైన వాతావరణం కోసం  ప్రయత్నిస్తుంటే వారిమీద అర్బన్ నక్సల్స్ ముద్ర వేస్తున్నారని, ఈ నేపథ్యంలోనే రెండో లేఖ రిలీజ్​ చేయగా చర్చల ప్రతిపాదనను  తమ బలహీనతగా కొందరు విషప్రచారం చేస్తున్నారని అన్నారు. 

కర్రెగుట్టల్లో సాయుధ బలగాలు పార్టీ క్యాడర్​ను చంపుతున్నాయని, జనజీవన స్రవంతిలో కలిసే విషయంలో నిర్ణయం తీసుకోవాలంటే తమ నాయకత్వం కూర్చొని చర్చించాల్సి ఉంటుందని, చుట్టూ బలగాలు ఉన్న వేళ కోర్ కమిటీ మీటింగ్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అందుకే రెండు పక్షాల నుంచి కాల్పుల విరమణ ప్రకటన కోరుతున్నామని స్పష్టం చేశారు. తాము శాంతిచర్చలకు ప్రయత్నాలు చేస్తుంటే .. మోదీ సర్కారు 2026 మార్చి 31  నాటికి మావోయిస్టులను  నిర్మూలిస్తామంటూ ఆపరేషన్ కగార్ నిర్వహిస్తోందని, తమను నిర్మూలించడం అసాధ్యమన్నారు. చిత్తశుద్ధి ఉంటే శాంతి చర్చలు జరిపాలని అభయ్​డిమాండ్​ చేశారు.