కోకాపేట భూముల వేలం.. గరిష్టంగా ఎకరం 60 కోట్లు

కోకాపేట భూముల వేలం.. గరిష్టంగా ఎకరం 60 కోట్లు
  • కోకాపేట భూముల వేలం.. ఎకరం 60 కోట్లు
  • 8 ప్లాట్లను వేలం వేసిన హెచ్ఎండీఏ
  • ఉదయం 9 నుంచి రాత్రి 8 వరకూ ఆన్​లైన్​లో ఆక్షన్  
  • అత్యధికంగా ఎకరాకు రూ. 60.20 కోట్లు
  • ఎకరాకు సగటున 40 కోట్లు 
  • హెచ్ఎండీఏకు 49 ఎకరాలకు రూ. 2 వేల కోట్ల ఆదాయం  

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా కోకాపేట​లోని సర్కార్ భూముల వేలంలో ఎకరం యావరేజ్​గా రూ. 40 కోట్లకు అమ్ముడైంది. ఎనిమిది ప్లాట్లలో 49.92 ఎకరాల భూమిని వేలం వేశారు. అత్యధికంగా రూ. 60.20 కోట్లకు ఒక ఎకరం పలికింది. యావరేజ్​గా ఎకరా భూమిని రూ. 40 కోట్లకు కొనుగోలు చేశారు. దీంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)కి దాదాపు రూ. 2,035 కోట్ల ఆదాయం సమకూరింది. 

ఆన్​లైన్​లో గురువారం ఉదయం 9 గంటలకు మొదలైన వేలం రాత్రి 8 గంటలకు ముగిసింది. ఆందోళనల నేపథ్యంలో భూముల వేలం ప్రక్రియను హెచ్ఎండీఏ గోప్యంగా నిర్వహించింది. మైత్రివనం స్వర్ణ జయంతి కాంప్లెక్సులోని హెచ్ఎండీఏ ఆఫీసు, కోకాపేట్​లోని నియోపొలిస్ వెంచర్ వద్ద పోలీసులను భారీగా మోహరించారు. బిడ్డింగ్​లో 63 మంది పాల్గొనగా, 8 ప్లాట్లను అమ్మారు. ఒక్కో ఎకరంపై యావరేజ్​గా రూ.40 కోట్ల ఆదాయం వచ్చింది. 

సామాన్యులకు ఇబ్బందులు 
ఈ–వేలం నేపథ్యంలో హెచ్ఎండీఏ ఆఫీసు వద్ద 50 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. కాంప్లెక్స్ లోకి ఎవరూ రాకుండా అడ్డుకున్నారు. ఐడీ కార్డులను పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతించారు. దీంతో స్వర్ణ జయంతి కాంప్లెక్సులో ఉన్న ఆధార్ నోడల్ సెంటర్, ఇతర ఆఫీసులకు వచ్చే జనాలు ఇబ్బందులు పడ్డారు. అయితే హెచ్ఎండీఏ అధికారులు ఒకరోజు ముందే సేవలు నిలిపేయాలని సమాచారం ఇచ్చినా, జాప్యం చేయడంతో జనం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

ఓ కంపెనీ అనుబంధ సంస్థలకే భూములు? 
వేలంలో 63 కంపెనీలు బరిలో నిలవగా..  ప్లాట్లను దక్కించుకున్న కంపెనీలన్నీ హైదరాబాద్ కు చెందినవే ఉన్నాయి. ఇందులో నాలుగు రియల్ ఎస్టేట్ కంపెనీలు, పలు ఫార్మా కంపెనీల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. రాజపుష్ప రియాలిటీ సంస్థ10 ఎకరాల విస్తీర్ణంలోని రెండు ప్లాట్లను రూ. 500 కోట్లకు దక్కించుకుంది. అయితే, ఒక ప్రముఖ నిర్మాణ రంగ సంస్థకు చెందిన అనుబంధ కంపెనీలే ఈ వేలంలో చురుగ్గా పాల్గొని భూములను చేజిక్కించుకున్నట్లుగా తెలిసింది. 

వేలంలో పదెకరాలు కొన్నాం.. 
కోకాపేట్ భూముల వేలాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని, పదెకరాలు కొనుగోలు చేశాం. కమర్షియల్, ఆఫీసు స్పేస్ కు ప్రధాన కేంద్రంగా ఉన్న కోకాపేట్ లో వరల్డ్ క్లాస్ సదుపాయాలతో ప్రాజెక్టుకు ప్లాన్ చేయబోతున్నాం. కమర్షియల్, రెసిడెన్షియల్ స్పేస్ కు ఉన్న డిమాండ్ ను బట్టి వెస్ట్ సిటీలోని కోకాపేట్ లో వెస్ట్ ఎవెన్యూ, నానక్ రాంగూడలో ప్యారడైమ్ ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి.   
- శ్రీనివాస రెడ్డి, రాజపుష్ప ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్