నాలా పనులను తొందరగా పూర్తి చేయాలె : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

నాలా పనులను తొందరగా పూర్తి చేయాలె : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్, వెలుగు: నాలా పనులను ఒకసారి మొదలుపెట్టిన తర్వాత మధ్యలోనే ఆపొద్దని.. వాటిని తొందరగా పూర్తి చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. కుత్బుల్లాపూర్ సర్కిల్​లో జరుగుతున్న నాలా పనులపై జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో బల్దియా, వాటర్ బోర్డు అధికారులతో సోమవారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ఇటీవల కురిసన వానలకు  కుత్బుల్లాపూర్​లోని పలు కాలనీలు ముంపునకు గురైనట్లు స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు. అక్కడ జరుగుతున్న నాలా పనులను తొందరగా పూర్తి చేయాలన్నారు. ఇంటర్ డిపార్ట్ మెంట్ సమస్యలు ఉంటే జోనల్ కమిషనర్​కు చెప్పాలని.. దాన్ని అక్కడే పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఒక చోట 
చేపట్టిన పనులను మధ్యలోనే వదిలేసి.. మరోచోట పనులు మొదలుపెట్టడం వల్ల వాన పడితే  లోతట్టు ప్రాంతాల జనం ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇకపై అలా కాకుండా చేపట్టిన పనులు పూర్తయ్యాకే మరో చోట కొత్తగా మొదలుపెట్టాలని సూచించారు. ఎస్ఎన్​డీపీ పనులకు నిధుల కొరత లేదన్నారు. కోర్టు కేసులు వెంటనే క్లియర్ చేయాలని.. పైప్​లైన్ షిఫ్టింగ్ పనులను ఇన్​ టైమ్ లో పూర్తి చేయాలన్నారు.  వరద ముంపునకు గురైన సుభాష్ నగర్, శివారెడ్డి నగర్, గోదావరి హోమ్స్, గాయత్రి కాలనీతో పాటు మిగతా ఏరియాల్లో పనులను పూర్తి చేసేందుకు అధికారులకు మేయర్ లక్ష్యాన్ని నిర్ణయించారు. సమావేశంలో జోనల్ కమిషనర్ మమత, ఎస్ఎన్డీపీ సీఈ వసంత, ఎస్ఈలు పాల్గొన్నారు.

అనంతగని కుంటను అందంగా మారుస్తం

బంజారాహిల్స్ రోడ్ నం.1లోని తాజ్ బంజారా హోటల్ సమీపంలో ఉన్న అనంతగని కుంట అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు మేయర్ విజయలక్ష్మి తెలిపారు.  సోమవారం జోనల్ కమిషనర్ రవి కిరణ్,  చీఫ్ ఎంటమాలజిస్ట్​ డాక్టర్ రాంబాబుతో కలిసి చెరువును పరిశీలించి అందులో ఆయిల్ బాల్స్​ను  వదిలారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. తాజ్ బంజారా సమీపంలోని  అనంతగని కుంటలోకి  పై నుంచి మురుగు వస్తున్న నేపథ్యంలో నీటిని శుద్ధి చేసేందుకు సీఎస్ఆర్  ద్వారా ఏరోపస్ అనే స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చిందన్నారు. ఇప్పటి వరకు తాను దత్తత తీసుకున్న ఈర్ల చెరువు, లంగర్ హౌస్ చెరువులను  అభివృద్ధి చేసినట్లుగా అనంతగని కుంటను  అందంగా మారుస్తామన్నారు.   

వానలకు అలర్ట్​గా ఉండాలి: డిప్యూటీ మేయర్

సికింద్రాబాద్: వానల నేపథ్యంలో పురాతన ఇండ్లలో ఉండే వారు జాగ్రత్తగా ఉండాలని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి సూచించారు. ఆదివారం కురిసిన వానకు లాలాపేటలోని ఎస్ బీఐ సమీపంలో ఉన్న ఓ పురాతన ఇంటి గోడ కూలిపోయింది. సోమవారం స్థానికులు అందించిన సమాచారం మేరకు  డిప్యూటీ మేయర్ శ్రీలతా రెడ్డి అక్కడికి చేరుకుని వారిని పరామర్శించి  వివరాలు అడిగి తెలుసుకున్నారు. మారేడ్ పల్లి తహసీల్దార్​కు ఫోన్ చేసి బాధిత కుటుంబానికి వీలైనంత తొందరగా నష్టపరిహారం వచ్చేలా చూడాలన్నారు. కరెంట్ సమస్య ఉండొద్దని విద్యుత్ సిబ్బందికి చెప్పారు. అంతకుముందు బల్దియా హెడ్డాఫీసులో దోమల నివారణ చర్యలపై ఎంటమాలజీ అధికారులతో డిప్యూటీ మేయర్ సమావేశం నిర్వహించారు. డెంగీ కేసులు నమోదవుతున్న  ప్రాంతాల్లో   చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధుల సమన్వయంతో కాలనీల్లో ఫాగింగ్‌‌, స్ప్రేయింగ్‌‌ చేపట్టాలన్నారు. కుంటలు, చెరువుల్లో డ్రోన్ల ద్వారా స్ప్రేయింగ్ చేస్తున్నట్లు చెప్పారు. అన్ని కుంటలు, చెరువుల్లో గుర్రపు డెక్కలు తొలగించి క్లీన్ చేశామన్నారు. స్కూళ్లలోనూ  అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు.