- రూ. 15 వేలు తీసుకుంటూ పట్టబడ్డ ఫారెస్ట్ ఆఫీసర్లు
బోథ్, వెలుగు : బిల్లు మంజూరు చేసేందుకు లంచం తీసుకున్న బోథ్ రేంజ్ ఎఫ్‌ఆర్‌వో టి.ప్రణయ్, జూనియర్ అసిస్టెంట్ ఎస్.పరశురాంను ఏసీబీ ఆఫీసర్లు గురువారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ జి.మధు తెలిపిన వివరాల ప్రకారం.. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో భాగంగా ఓ వ్యక్తి అర్బన్ పార్క్‌లో మొక్కలకు నీరు పోసే కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నాడు. ఈ పనికి సంబంధించి రూ. 5.09 లక్షల బిల్లు మంజూరు అయింది.
ఈ బిల్లు ఇప్పించాలని సదరు వ్యక్తి ఎఫ్‌ఆర్‌ఓ ప్రణయ్, జూనియర్ అసిస్టెంట్ పరశురాం కలువగా.. వారు రూ. 40 వేలు డిమాండ్ చేశారు. దీంతో అంత ఇచ్చుకోలేనని బాధితుడు చెప్పడంతో చివరకు రూ.15 వేలకు ఒప్పందం కుదిరింది. అనంతరం సదరు కాంట్రాక్టర్ ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనతో గురువారం ఎఫ్‌ఆర్‌ఓ ప్రణయ్, జూనియర్ అసిస్టెంట్ పరశురాంను కలిసి డబ్బులు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
