- బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: వలస వ్యవసాయ కూలీల పిల్లల సమస్యలపై అంతరాష్ట్ర స్థాయిలో కో ఆర్డినేషన్ అవసరమని బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ పేర్కొన్నారు. భద్రాద్రికొత్తగూడెం కలెక్టరేట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి రివ్యూ సమావేశాన్ని ఆమె గురువారం నిర్వహించారు.
తల్లిదండ్రుల అవగాహనతోనే సమాజంలో మార్పు సాధ్యమన్నారు. క్షేత్ర స్థాయిలో సమస్యలను గుర్తించి కమిషన్ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సీజన్ల వారీగా ఇతర రాష్ట్రాల నుంచి ప్రధానంగా చత్తీస్ఘడ్ నుంచి వచ్చే వ్యవసాయ కూలీల పిల్లల సమస్యలపై అంతరాష్ట్ర స్థాయిలో సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ములకలపల్లి మండలం ధర్మన్న నగర్లో అంగన్వాడీ కేంద్రం లేకపోవడంతో.. అవసరమైతే కంటైనర్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అంకిత్ , ఎస్పీ బి. రోహిత్ రాజు , అడిషనల్ కలెక్టర్ డి. వేణుగోపాల్, కమిటీ మెంబర్లు పాల్గొన్నారు.
