పొంగులేటి చిట్టా విప్పుతాం.. ఆ భూములపై హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోలే: హరీశ్రావు

పొంగులేటి చిట్టా విప్పుతాం.. ఆ భూములపై హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోలే: హరీశ్రావు

వనపర్తి, వెలుగు: రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అవినీతి చిట్టా విప్పుతామని బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. గురువారం వనపర్తి జిల్లా గొల్లపల్లి–చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ బాధితులు చేస్తున్న దీక్షలు నూరు రోజులు పూర్తయిన సందర్బంగా వారికి సంఘీభావం తెలిపారు. ఏదుల వద్ద జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. 

అసెంబ్లీలో సీఎం స్వయంగా రాఘవ కన్​స్ట్రక్షన్స్ లో అవినీతిని తమ అధికారులే బయటపెట్టినట్టు చెప్పారని, ఆ మైనింగ్ నీది కాకపోతే అక్కడ కంటైనర్ మీద రాఘవ కంపెనీ పేరు, కాంగ్రెస్ జెండా ఎందుకున్నాయో సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. 

అప్పుడు అసెంబ్లీలోనే ఉన్న మంత్రి తనకు మైనింగ్ లేదని ఎందుకు చెప్పలేదన్నారు.  అధికారులు రాఘవ కన్స్ట్రక్షన్ కు నోటీసులిచ్చారని, అధికారులు చెప్పింది తప్పా, పొంగులేటి చెప్పింది తప్పా, మైనింగ్ మంత్రి చెప్పింది తప్పా.. చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ 2016లో నాదర్​గుల్ భూములను నిషేధిత జాబితాలో పెట్టిందన్నారు. 

ఈ భూములను కొల్లగొట్టేందుకు కొన్ని కంపెనీలు ప్రయత్నం చేస్తే ఆర్డీవో నిషేధిత జాబితాలో పెట్టారని గుర్తు చేశారు. 2022లో కంపెనీలు హైకోర్టుకు పోగా.. ప్రభుత్వం తన వాదన వినిపించిందని, ఆర్డీవో నిర్ణయం సరైందని ప్రకటించిందని చెప్పారు. నాదర్​గుల్ భూమి ప్రభుత్వ భూమి అని సుప్రీంకోర్టులో కేసు వేశామంటున్న మంత్రి ఆ భూములను ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించారు. అది సీలింగ్ ల్యాండ్ అని, అయినా హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు.