ఏజెన్సీ భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం

ఏజెన్సీ భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం
  • తెలంగాణ రైతు కమిషన్‌‌‌‌ చైర్మన్ కోదండరెడ్డి

అమ్రాబాద్, వెలుగు : నల్లమల ఏజెన్సీ ప్రాంతాల రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర రైతు కమిషన్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ కోదండరెడ్డి చెప్పారు. నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ బాదావత్‌‌‌‌ సంతోష్‌‌‌‌, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, రైతు కమిషన్‌‌‌‌ సభ్యులు మర్రికంటి భవానీరెడ్డి, కేవీఎన్‌‌‌‌.రెడ్డి, రాంరెడ్డి గోపాల్‌‌‌‌రెడ్డి, రాములు నాయక్, భూమి సునీల్‌‌‌‌కుమార్‌‌‌‌తో కలిసి గురువారం అమ్రాబాద్‌‌‌‌లో రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ... ఏజెన్సీ ప్రాంతాల్లో భూమి హక్కుల గుర్తింపు, పత్రాల సమస్యలు, భూ వివాదాలు వంటి అంశాలు రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయన్నారు. రైతులను డైరెక్ట్‌‌‌‌గా కలిసి సమస్యను తెలుసుకొని పరిష్కరించాలన్న ఉద్దేశంతోనే క్షేత్ర పర్యటనకు వచ్చినట్లు చెప్పారు.

రైతులు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతామని, గిరిజన రైతుల భూ హక్కులను రక్షించడం, ప్రభుత్వ విధానాలను అమలు చేయడమే రైతు కమిషన్‌‌‌‌ ప్రధాన లక్ష్యమన్నారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇప్పుడు రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులకు న్యాయం జరిగేలా ప్రస్తుత ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నల్లమల ఏజెన్సీలో అటవీ భూములను రక్షించుకుంటూనే.. రైతులకు మేలు చేసేలే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కలెక్టర్‌‌‌‌ సంతోష్‌‌‌‌ మాట్లాడుతూ... టెక్నికల్‌‌‌‌ ఇబ్బందుల కారణంగా రైతులకు మార్టిగేజ్, ఎల్‌‌‌‌టీ లోన్లు అందడం లేదని ఈ సమస్య పరిష్కారానికి స్పెషల్‌‌‌‌ డ్రైవ్‌‌‌‌ నిర్వహించి సక్సేషన్‌‌‌‌ పూర్తి చేసి, బ్యాంకులతో సమన్వయం చేసి లోన్లు అందేలా చూస్తామన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆయిల్‌‌‌‌పామ్‌‌‌‌ సాగుకు అవకాశం కల్పించాలని కోరారు. సమావేశంలో అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ అమరేందర్, అచ్చంపేట ఆర్డీవో యాదగిరి, అమ్రాబాద్ సర్పంచ్ బిగుర్ల కోటయ్య పాల్గొన్నారు.