జీసీసీల రాజధానిగా హైదరాబాద్

జీసీసీల రాజధానిగా హైదరాబాద్
  • మెక్​డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ 
  • మా పాలనపై విశ్వాసానికి ప్రతీక: డిప్యూటీ సీఎం భట్టి
  • మెక్​డొనాల్డ్స్ అంటే గ్లోబలైజేషన్​కు నిదర్శనం: మంత్రి శ్రీధర్ బాబు
  • హైటెక్​సిటీలో ఆఫీస్ ప్రారంభోత్సవానికి హాజరు

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పాలనపై నమ్మకం, విశ్వాసానికి, ప్రభుత్వ ప్రతిభకు మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ ఏర్పాటే నిదర్శనమని డిప్యూటీ సీఎంభట్టి విక్రమార్క అన్నారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ల(జీసీసీ) ఏర్పాటుకు హైదరాబాద్ రాజధానిగా నిలిచిందని తెలిపారు. మాజీ ప్రధానులు జవహర్​లాల్ నెహ్రూ, పీవీ నర్సింహారావు, మన్మోహన్ సింగ్ వంటి మహానేతలు దూరదృష్టితో చేపట్టిన చర్యలతో హైదరాబాద్​కు మరింత బలం చేకూరిందని వివరించారు. 

హైటెక్ సిటీలో 1.56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీసును ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్​బాబుతో కలిసి బుధవారం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

మెక్​డొనాల్డ్స్. కేవలం ఆహారం కోసం ఏర్పాటు చేసిన సంస్థ మాత్రమే కాదు. పరిమాణం, సామర్థ్యం, అనుసంధానమైన ప్రపంచం అనే భావనకు ప్రతీక. మెక్​డొనాల్డ్స్ కథ ధైర్యవంతమైన ఆలోచనలు ఒకేసారి పల్లె, ప్రపంచమంతా వ్యాపించిన విజయగాథ. హైదరాబాద్ కూడా అలాంటి ప్రయాణమే చేసింది. మినార్లు, సరస్సులో ఉన్న చారిత్రక నగరం నుంచి డేటా, డిజైన్ వంటి వాటికి గ్లోబల్ హబ్​గా ఎదిగింది. మెక్​డొనాల్డ్స్ కొత్త గ్లోబల్ ఆఫీసు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణానికి కీలకం’’అని భట్టి తెలిపారు. జీసీసీలు షికాగోను చార్మినార్​తో.. బోస్టన్​ను బంజారాహిల్స్​తో.. లండన్​ను లింగంపల్లితో.. కలుపుతున్నాయని చెప్పారు. 

రైజింగ్ తెలంగాణే మా లక్ష్యం: శ్రీధర్ బాబు

రైజింగ్ తెలంగాణ లక్ష్య సాధనకు తమ ప్రభుత్వం మెక్ డొనాల్డ్స్ లాంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థతో కలిసి పని చేసేందుకు ప్రాధాన్యమిస్తున్నదని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అమెరికా బయట అతిపెద్ద ఆఫీస్​ను హైదరాబాద్​లో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన కంపెనీ ప్రతినిధులకు ధన్యవాదాలు చెప్పారు. ‘‘పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అనువైన ఎకో సిస్టం, ఇన్​ఫ్రాస్ట్రక్చర్, టాలెంట్ పూల్, విశ్వాసానికి గొప్ప నిదర్శనం. 

మెక్ డొనాల్డ్స్ అంటే గ్లోబలైజేషన్ కు నిలువెత్తు నిదర్శనం. ముందు చూపుతో 1991లో అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు అమలు చేసిన ఎల్పీజీ సంస్కరణలతో మెక్ డొనాల్డ్స్ లాంటి ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు మన దేశంలో అడుగు పెట్టాయి’’అని శ్రీధర్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెక్ డొనాల్డ్ కంపెనీ ప్రతినిధులు మిస్ స్కై అండర్సన్, దేశాంత్ కైలా, మ్యాటిజ్ బ్యాక్స్, స్పీరో ద్రూలియాస్ పాల్గొన్నారు.