తెలంగాణలో అడ్వెంట్ ఇంటర్నేషనల్ రూ.16 వేల 650 కోట్ల పెట్టుబడి

తెలంగాణలో అడ్వెంట్ ఇంటర్నేషనల్  రూ.16 వేల 650 కోట్ల పెట్టుబడి

మంత్రి కేటీఆర్‌‌‌‌ను కలిసిన సంస్థ ప్రతినిధులు

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ సెక్టార్‌‌‌‌లో రూ.16,650 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అడ్వెంట్ ఇంటర్నేషనల్ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు శుక్రవారం ఆ సంస్థ ఎండీ పంకజ్ పట్వారీ, ఆపరేటింగ్ పార్ట్‌‌నర్ వైదీశ్ అన్నస్వామి ప్రగతి భవన్‌‌లో మంత్రి కేటీఆర్‌‌‌‌ను కలిశారు. ఈ సంస్థ సువెన్ పార్మాస్యూటికల్ కంపెనీలో రూ.9,589 కోట్లు, ‘కోహన్స్ ప్లాట్ ఫామ్’ద్వారా మరిన్ని సంస్థల్లో మిగతా పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. 

హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో తమ రీసెర్చ్ అండ్ డెవలప్‌‌మెంట్ ల్యాబ్‌‌ను ఏర్పాటు చేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అలాగే, అడ్వెంట్ ఇంటర్నేషనల్ తమ సంస్థలైన ఆర్ఏ కెమ్ ఫార్మా, జెడ్‌‌సీఎల్‌‌ కెమికల్స్, అవ్రా లేబొరేటరీస్‌‌లను హైదరాబాద్‌‌లో ఏర్పాటు చేయనుంది. 

కాగా, ఇటీవల మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో భాగంగా అడ్వెంట్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ పార్ట్‌‌నర్ మల్డొనాడోతో సమావేశమై హైదరాబాద్‌‌లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. దానికి కొనసాగింపుగా ఆ సంస్థ ప్రతినిధులు 
మంత్రి​ని కలిశారు. హైదరాబాద్​లో భారీ పెట్టుబడి పెట్టేందుకు వచ్చిన అడ్వెంట్​ సంస్థ ముందుకు రావడంపై కేటీఆర్​ హర్షం వ్యక్తం చేశారు.