‘మీ డబ్బు మీ హక్కు’ను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

‘మీ డబ్బు మీ హక్కు’ను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్​ టౌన్, వెలుగు: జిల్లా వ్యాప్తంగా ప్రజలు ‘మీ డబ్బు మీ హక్కు’ను సద్వినియోగం చేసుకోవాలని మెదక్​ కలెక్టర్​ రాహుల్​ రాజ్​ అన్నారు. మంగళవారం కలెక్టరేట్​లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి  ఆయా బ్యాంకులు, ఎల్ఐసీ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ క్లయిమ్​ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల కోసం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఆర్​బీఐ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 

మెదక్ జిల్లాలో 1,65,053 అకౌంట్లలో రూ.21,32 కోట్ల ఉన్నాయని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమ వివరాలు అందించి డబ్బులు పొందాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయా బ్యాంకుల్లోని ఖాతాదారులకు ఎస్ బీఐ నుంచి రూ.2.07 కోట్లు, యూనియన్ బ్యాంక్ రూ.1.05 కోట్ల పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్ బీఐ రీజినల్ డైరెక్టర్ చిన్మయి కుమార్, బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల ను తిరిగి పొందాలి..

సిద్దిపేట రూరల్: బ్యాంకుల్లో ఉన్న అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల ను ప్రజలు తప్పకుండా తమ హక్కుగా పొందాలని, వెంటనే వాటిని క్లెయిమ్ చేసుకోవాలని సిద్దిపేట కలెక్టర్ కే. హైమావతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో ఆర్బీఐ, నాబార్డ్, లీడ్ బ్యాంక్ ల ఆధ్వర్యంలో మీ డబ్బు మీ హక్కు అనే అవగాహన కార్యక్రమం నిర్వహించగా, కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 

సిద్దిపేట జిల్లాలో అన్ని బ్యాంకుల్లో కలిపి మొత్తం 1,65,605 డెఫ్ ఖాతాలు ఉండగా, వాటిలో రూ.34.74 కోట్లు అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లుగా ఉన్నాయని, ఈ మొత్తాన్ని ప్రజలు ఆలస్యం చేయకుండా వెంటనే తమ సంబంధిత బ్యాంకులను సంప్రదించి క్లెయిమ్ చేసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లాలోని ఎమ్మార్వో లు, ఎన్నికల బీఎల్వో, ఇతర రెవెన్యూ అధికారులతో జూమ్ సమావేశం ద్వారా ఎలక్టోరల్ మ్యాపింగ్ ప్రక్రియ పై సమీక్ష నిర్వహించారు. 

డిసెంబర్ 31 లోపు ఎలక్టోరల్ రోల్ మ్యాపింగ్ 100 శాతం పూర్తి చెయ్యాలని బిఎల్ఓ లను ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్​లో ప్రభుత్వ ఇంటర్మీడియెట్​ కాలేజీల ప్రిన్సిపాల్స్, సిబ్బందితో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్​ హైమావతి మాట్లాడుతూ మెరుగైన ఫలితాలు సాధించాలని, ప్రతి ఒక్క విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా పనిచేయాలని ఆదేశించారు. 

బోర్డ్ పరీక్షల వరకు 50 రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చెయ్యాలని, పిల్లలకు ప్రత్యేక తరగతులు పెట్టాలన్నారు. అనంతరం చిన్నకోడుర్ మండలం కస్తూరిపల్లి ఎంపీపీఎస్ స్కూల్ ను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.