- కలెక్టర్ ఆదేశాలతో మెదక్‌లోని కేర్ హాస్పిటల్ సీజ్
మెదక్, వెలుగు: పుట్టగానే చనిపోయిందని చెప్పి, పసికందును విక్రయించారు. ఈ ఘటన మెదక్ లోని ఓ ప్రైవేట్ఆస్పత్రిలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎంహెచ్‌వో సదరు హాస్పిటల్‌ను సీజ్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. హైదరాబాద్‌లోని మౌలాలికి చెందిన నస్ర ఫాతిమా నిండుగర్భిణి. గత నెల 12న మెదక్ పాత బస్టాండ్ వద్ద నిల్చొని ఉండగా ఆమెపై కోతులు దాడి చేశాయి. కిందపడిన బాధితురాలికి పొట్ట భాగంలో రక్తస్రావమైంది.
వెంటనే తనకు పరిచయమున్న మెదక్‌కు చెందిన పర్వీన్ బేగం సహాయంతో కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు వెళ్లి, అడ్మిట్ అయ్యింది. డాక్టర్లు రాత్రే ఆమెకు డెలివరీ చేశారు. అయితే, అదే హాస్పిటల్‌లో నర్స్ గా చేస్తున్న అక్తరీ బేగం పాప పుట్టి చనిపోయిందని నస్ర ఫాతిమాకు చెప్పింది. మూడు రోజులకు ఆమెను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్‌చేశారు.
తర్వాత 5 రోజులకు నస్ర ఫాతిమా చెకప్ కోసం మళ్లీ హాస్పిటల్ కు వెళ్లేందుకు మెదక్ వచ్చి బస్టాండ్ వద్ద ఉండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి.. నీకు పుట్టిన పాప బతికే ఉందని చెప్పాడు. దీంతో నస్ర ఫాతిమా వెంటనే పర్వీన్ బేగం దగ్గరికి వెళ్లి అడిగితే.. సరైన సమాధానం చెప్పలేదు. ఏం జరిగిందని విచారించగా మధ్యవర్తి నిలోఫర్ అలియాస్ నౌసిన్ ఉన్నీసా ద్వారా సిద్దిపేటకు చెందిన ఆమె బంధువులు మహమ్మద్ ఇక్బాల్ ఉద్దీన్, సదియా సుల్తానా దంపతులకు రూ.1.50 లక్షలకు విక్రయించినట్లు తెలిసింది.
తనకు పుట్టిన పాపను నర్స్అక్తరీ బేగం కిడ్నాప్ చేసి, అమ్మేసిందని బాధితురాలు ఈ నెల 3న మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు పాపను మంగళవారం స్వాధీనం చేసుకుని మెదక్ సఖి కేంద్రంలో అప్పగించారు. పాప విక్రయంలో ప్రధాన నిందితురాలు, కేర్ హాస్పిటల్ నర్స్ అక్తరీ బేగం, నీలోఫర్ అలియాస్ నౌసిన్ ఉన్నీసా, పాపను కొనుగోలు చేసిన దంపతులు మహమ్మద్ ఇక్బాల్ ఉద్దీన్, సదియా సుల్తానాలను అరెస్ట్ చేశారు.
