- ఎమ్మెల్యే సునీతారెడ్డి తీరు హాస్యాస్పదం
- డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్
నర్సాపూర్, వెలుగు: డబుల్ బెడ్ రూమ్ ల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ఊరికునేది లేదని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్సుహాసిని రెడ్డి అన్నారు. ఆదివారం వారు నర్సాపూర్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలంటూ ఎమ్మెల్యే సునీతారెడ్డి ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు బిల్లులు చెల్లించక అర్ధంతరంగా పనులు నిలిచిపోయాయని గుర్తు చేశారు.
రాజకీయ ఉనికి కోసం డబుల్ బెడ్ రూమ్ డ్రామా ఆడొద్దని హితవు పలికారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లి వెంటనే రూ.6 కోట్లు విడుదల చేయించి పనులు పూర్తి చేయించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. త్వరలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటిసీ శ్రీనివాస్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు.
