సిద్దిపేట(దుబ్బాక), వెలుగు: గత సర్పంచుల పెండింగ్ బిల్లుల చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. గురువారం దుబ్బాక మండలంలోని బొప్పాపూర్ లో బాల వికాస వాటర్ ప్లాంట్, ఓపెన్ జిమ్‌లను, సోలార్ లైట్ల నిర్మాణ పనులను ప్రారంభించి మాట్లాడారు. సర్పంచుల పెండింగ్ బిల్లులతోపాటు మన ఊరు–మనబడి కార్యక్రమం కింద చేపట్టిన పనుల బిల్లులు ఇంతవరకు చెల్లించలేదన్నారు.
వేడుకల కోసం వేల కోట్లు, ఫ్యూచర్ సిటీ కోసం లక్ష కోట్లు కేటాయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల పెండింగ్ బిల్లుల మంజూరు విషయంలో ఎందుకు జాప్యం చేస్తుందో చెప్పాలని డిమాండ్‌చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో వీటిపై చర్చ జరగాలని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలను వ్యక్తిగత దూషణలకు దిగొద్దని, ప్రజల సమస్యలపై చర్చించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ భానుప్రసాద్, పాలకవర్గ సభ్యలు పాల్గొన్నారు.
మన ఊరు–మన బడి బకాయిలు చెల్లించాలి
గజ్వేల్, వెలుగు: మన ఊరు–మన బడి కార్యక్రమ పెండింగ్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్‌చేశారు. గురువారం నూతన సంవత్సరం సందర్భంగా ఆయన గజ్వేల్ పట్టణంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గ్రామాల్లోని పాఠశాలల్లో పనులు చేపట్టిన స్కూల్ కమిటీ చైర్మన్లు, మాజీ సర్పంచులు తీవ్ర ఇబ్బందుతు పడుతున్నారని తెలిపారు.
ఆయా పనుల్లో ఎక్కడైనా అవకతవకలు జరిగితే అసెంబ్లీలో చర్చ పెట్టాలన్నారు. కానీ బిల్లులు ఆపవద్దని కోరారు. బీజేపీ నాయకులు గాడిపల్లి భాస్కర్, మనోహర్ యాదవ్ తదితరులున్నారు.
