రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి : ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి : ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు
  • మెదక్​ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్​ రావు

మెదక్​ టౌన్, వెలుగు : రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని మెదక్​ఎస్పీ డీవీ శ్రీనివాస్​ రావు తెలిపారు. శుక్రవారం జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల వాల్​పోస్టర్​ను ఆవిష్కరించి మాట్లాడారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్, సీట్‌బెల్ట్ పెట్టుకోకపోవడం తదితర కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.  జిల్లా పోలీస్​శాఖ, రవాణా శాఖ అధికారులతో కలిసి రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. వాహనదారులకు సలహాలు, సూచనలు, విద్యాసంస్థలు, గ్రామాలు, పట్టణాల్లో ప్రచార కార్యక్రమాలు చేపడతామని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను పాటించి ప్రాణాలను కాపాడుకోవాలన్నారు. 

సైబర్​ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ ఆఫీస్​లో  సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీకే ఫైళ్లు, లోన్​యాప్స్​, బెట్టింగ్ మోసాలను వివరించారు. అధికంగా విద్యావంతులే సైబర్ నేరాలబారిన పడడం బాధాకరమన్నారు.  అవగాహన లోపం, అత్యాశ, తొందరపాటు నిర్ణయాలే ప్రధాన కారణమన్నారు.  మొబైల్‌లోని కాంటాక్ట్స్, ఫొటోలు, వ్యక్తిగత సమాచారాన్ని తెలుపవద్దన్నారు.  

అశ్లీల సందేశాలు పంపడం, పరువు నష్టం కలిగించే ఘటనలు జరుగుతున్నాయని వివరించారు. బ్యాంక్ వివరాలు, ఓటీపీలు ఇతరులకు తెలుపొద్దన్నారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 డయల్​ చేయాలన్నారు. www.cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఆయా కార్యక్రమాల్లో మెదక్ జిల్లా ఏఎస్పీ మహేందర్, సీఐలు సందీప్ రెడ్డి, కృష్ణమూర్తి, ఆర్ఐ శైలేందర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్​స్పెక్టర్ శ్రీనివాస రావు, ఎస్సై శివానందం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.