మేడారం నిండా జనమే : జనసంద్రమైన జంపన్న వాగు

మేడారం నిండా జనమే :  జనసంద్రమైన జంపన్న వాగు

అడివంతా గుడారాలతో జనారణ్యమైంది..
మేడారం జమీనంతా జనమే జనం..
వన దేవతల పండుగ నిండు జనజాతరైంది
గద్దెనెక్కిన సారలమ్మ తోడుగా వచ్చిన
పగిడిద్దరాజు, గోవిందరాజు
ప్రభుత్వ లాంఛనాలతో ఆడబిడ్డకు ఆహ్వానం 
మొదటిరోజు 30లక్షల మందికి పైగా భక్తుల రాక

మేడారం, వెలుగు: మేడారం వనం భక్తజనంతో నిండిపోయింది. శివసత్తుల పూనకాలు.. భక్తుల జయజయ ధ్వానాలతో మహాజాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. బుధవారం సారలమ్మ రాకతో జాతర మొదలైంది. దారి పొడవునా వేలాదిమంది భక్తులు అమ్మ కోసం ఎదురేగి.. దండాలు పెడుతూ.. ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ స్వాగతం పలికారు. అంతకుముందు సాయంత్రం కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం వడ్డెలు(పూజారులు) ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ లాంఛనాలతో జరిపారు. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు వాయిద్యాలు, నృత్యాలతో కన్నెపల్లి ఆలయం మార్మోగింది. సాయంత్రం 6:02 గంటలకు పూజారులు కాక సారయ్య, కాక కిరణ్ తదితరులు సారలమ్మ పూజా మందిరానికి చేరుకొని క్రతువు ప్రారంభించారు.  సాయంత్రం 6.48 గంటల సమయంలో గుడి నుంచి సారలమ్మ ప్రతిరూపమైన పసుపు, కుంకుమను  మొంటె(వెదురు బుట్ట)లో  తీసుకుని మేడారానికి బయలుదేరారు. మార్గమధ్యంలో జంపన్నవాగులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ్నుంచి మేడారంలోని సమ్మక్క ఆలయానికి చేరుకున్నారు. అక్కడ కూడా పూజలు జరిపారు. తర్వాత సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు  రూపాలను అర్ధరాత్రి మేడారం గద్దెలపైకి చేర్చారు.

మేడారం గద్దెలకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లిలోని దేవాలయంలో సారలమ్మ కొలువై ఉంటుంది.  బుధవారం ఉదయం పూజారులు సారలమ్మ దేవాలయంలో పూజలు చేశారు. తులసి చెట్టు ముందు పటం వేశారు. అటు తర్వాత ఉదయం 11 గంటలకు మేడారంలోని గద్దెల వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు చేసి ముగ్గులు వేశారు. సాయంత్రం కన్నెపల్లి దేవాలయం నుంచి ప్రధాన పూజారి కాక సారయ్య.. సారలమ్మను తీసుకొని బయల్దేరగానే పిల్లలు కావాలని కోరుకునే వారు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు, అవివాహితులు గుడి ఎదుట తడి బట్టలతో కన్నెపల్లిలో వరం పట్టారు. వరం పడుతున్న వారిపై నుంచి పూజారులు నడుచుకుంటూ ముందుకు సాగారు. సారలమ్మే తమ పైనుంచి నడిచివెళ్తున్నట్లుగా భక్తులు పరవశించిపోయారు. ప్రజాప్రతినిధులు, అధికారులూ సారలమ్మను తీసుకెళ్తున్న పూజారిని తాకడానికి ప్రయత్నించారు. కొందరైతే కిందపడుకొని తమపై నుంచి నడిపించుకున్నారు. కన్నెపల్లి గ్రామ మహిళలు మంగళ హారుతులిచ్చి, కొబ్బరికాయలు కొట్టి అమ్మవారిని సాగనంపారు. తల్లిని తాకాలనే ఉత్సాహంతో చాలా మంది పైకి ఎగబడటానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రక్షణగా నిలబడుతూ అమ్మవారికి బాట ఇచ్చారు. కన్నెపల్లి నుంచి సారలమ్మతో బయల్దేరిన పూజారులు జంపన్నవాగు గుండా నేరుగా మేడారంలోని గద్దెల వద్దకు తీసుకొచ్చి ప్రతిష్టించారు. జంపన్నవాగు దాటుతున్న టైంలో పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులు రెండు చేతులు పైకెత్తి అమ్మవారికి స్వాగతం పలికారు.

తోడుగా పగిడిద్దరాజు, గోవిందరాజు

కొత్తగూడ మండలంలోని పూనుగొండ్ల నుంచి సారలమ్మ తండ్రి పగిడిద్దరాజు, కన్నాయిగూడెం మండలం కొండాయి  నుంచి గోవిందరాజు ప్రతిరూపాలను కూడా పూజారులు మేడారం గద్దెలపైకి తీసుకువచ్చారు.

పోటెత్తిన భక్తులు.. పోలీసుల ఆంక్షలు

మేడారం ప్రాంతంలోని కన్నెపల్లి, రెడ్డిగూడెం, జంపన్నవాగు, కొత్తూరు, నార్లాపూర్‌‌ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. పుణ్యస్నానాలతో జంపన్నవాగు మొత్తం జనంతో నిండిపోయింది. లక్షలాదిగా వస్తున్న భక్తులతో అడవి దారులన్నీ పోటెత్తాయి. మేడారం నలువైపులా కిలోమీటర్ల మేర దారులు వాహనాలు, భక్తులతో నిండిపోయాయి.  బుధవారం 30 లక్షల మందికి పైగా భక్తులు జాతరకొచ్చారు. పోలీసుల ఆంక్షలతో చాలా మంది భక్తులు ఇబ్బందులు పడ్డారు. కన్నెపల్లి నుంచి మేడారం గద్దెల వద్దకు సారలమ్మను తీసుకువచ్చే అద్భుత సన్నివేశాన్ని కనులారా చూసేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. దారి పొడవునా ఇరువైపులా ఎదురేగి దండాలు పెట్టారు. సారలమ్మ రాకను సూచిస్తూ ఆదివాసీ పూజారులు కొమ్ముబూరలు ఊదారు.  సారలమ్మను తీసుకువచ్చే వేడుకలో ప్రభుత్వం తరఫున ఐటీడీఏ పీవో హన్మొంతు కొండిబా, మాజీ ఐటీడీఏ పీవో చక్రధర్‌‌‌‌రావు, డీఆర్వో రమాదేవి, ములుగు ఏఎస్పీ సాయి చైతన్య, ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు.

కోయ నృత్యం చేసిన ఎమ్మెల్యే సీతక్క

సారలమ్మను గద్దెకు తీసుకొచ్చే క్రమంలో కన్నెపల్లి ఆలయంలో మహిళలు, యువతులతో కలిసి ములుగు ఎమ్మెల్యే సీతక్క కోయనృత్యం చేశారు. ఐఏఎస్‌‌‌‌, ఐపీఎస్‌‌‌‌ అధికారులు హన్మంతు కొండిబా, సాయిచైతన్య సైతం చేతులు కలిపి నృత్యం చేశారు.

మేడారంలో సీఎస్‌‌‌‌, డీజీపీ

బుధవారం ఉదయమే  చీఫ్‌‌‌‌ సెక్రటరీ సోమేశ్‌‌‌‌కుమార్‌‌‌‌, డీజీపీ మహేందర్‌‌‌‌రెడ్డి మేడారం సందర్శించి అధికారులకు సూచనలిచ్చారు. ఈ నెల 7న  గవర్నర్‌‌ ‌‌తమిళిసై, సీఎం కేసీఆర్‌‌‌‌, 8న కేంద్ర మంత్రి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌‌‌‌ ఆర్వీ కర్ణన్‌‌‌‌ను ఆదేశించారు. మంత్రి సత్యవతి రాథోడ్‌‌ ‌‌సైతం మేడారం చేరుకొని భక్తులతో మాట్లాడారు. సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.