‘మేడారం’ ఆదాయం  రూ.13.51 కోట్లు..2024 జాతరతో పోల్చితే రూ.26 లక్షలు అదనం

‘మేడారం’ ఆదాయం  రూ.13.51 కోట్లు..2024 జాతరతో పోల్చితే రూ.26 లక్షలు అదనం
  • బంగారం 486.5 గ్రాములు
  • 31 కిలోల 700 గ్రాముల వెండిని మొక్కుగా సమర్పించిన భక్తులు
  • 8 రోజులపాటు హుండీల లెక్కింపు 

వరంగల్, వెలుగు:  తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క, సారక్క మహా జాతర–2026 జనవరి 28, 29,30,31 తేదీల్లో ములుగు జిల్లాలోని మేడారంలో అత్యంత వైభవంగా జరిగింది. 8 రోజులుగా హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న హుండీల లెక్కింపు గురువారం ముగిసింది. ఈ ఏడాది జాతర ఆదాయం రూ.13 కోట్ల 51 లక్షల 76 వేల 275 వచ్చిందని ఎండోమెంట్​ఆఫీసర్లు తెలిపారు. కాగా, 2024 జాతరతో పోలిస్తే ఈసారి రూ.26 లక్షల ఆదాయం అదనంగా వచ్చిందని పేర్కొన్నారు. 

828 హుండీలు ఏర్పాటు

ఈసారి జాతరలో మొత్తం 828 హుండీలు ఏర్పాటు చేశారు. ఇందులో సమ్మక్క, సారక్క గద్దెల వద్ద 309 చొప్పున, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల వద్ద 81 చొప్పున 780 ఏర్పాటు చేయగా.. 45 క్లాత్‍ హుండీలు, 3 ఒడిబియ్యం హుండీలు పెట్టారు. ఈ నెల 5 నుంచి 200 మంది ఆలయ సిబ్బంది, మరో 300 మంది వలంటీర్లతో లెక్కింపు చేపట్టగా.. భక్తులు హుండీల్లో వేసిన కరెన్సీ నోట్లు, నాణేల రూపంలో మొత్తం ఆదాయం రూ.13 కోట్ల 51 లక్షల 76 వేల 275 వచ్చింది. తిరుగువారం 40 హుండీలతో కలిపి మంగళవారం నాటికే జాతరలో ఏర్పాటు చేసిన అన్ని హుండీలను లెక్కించారు.

ఫారిన్‍ కరెన్సీని రోజువారీగా ఇండియన్‍ కరెన్సీలోకి మార్చారు. చివరి రెండు రోజులైన బుధ, గురువారాల్లో చిల్లర నాణేలు లెక్కించి, కిలోల చొప్పున తూకం వేసి బ్యాగుల్లో కట్టారు.బంగారం, వెండితోపాటు ఆన్​లైన్​లో డబ్బులుభక్తులు హుండీల్లో కానుకల రూపంలో 486.5 గ్రాముల బంగారం, 31 కిలోల 700 గ్రాముల వెండి వేశారు. రెగ్యులర్‍ హుండీలే కాకుండా ఆన్‍లైన్‍ పేమెంట్‍ చేసే భక్తుల కోసం క్యూ ఆర్‍ కోడ్​ఏర్పాటు చేసిన ఈ–హుండీల్లో ఏకంగా రూ.21,36,607 వచ్చాయి. వీటితోపాటు 16 దేశాల డాలర్లు, ఇతర కరెన్సీ వచ్చినట్లు అధికారులు తెలిపారు.  

మెషీన్లు ఉపయోగించి లెక్కింపు

2024లో నిర్వహించిన జాతరలో 540 హుండీలను లెక్కించడానికి వారం రోజులు పట్టగా.. ఈసారి మరో 288 హుండీలు పెరిగినా అదనంగా ఒక్క రోజులోనే పూర్తి చేశారు. గతంలో నాణేలు లెక్కించడానికి ఎక్కువ రోజుల సమయం తీసుకునేవారు. ఒడి బియ్యంలో కలిసివచ్చే రూపాయి, రూ.2, రూ.5, రూ.10 కాయిన్​లను బియ్యం నుంచి వేరుచేసి ఒక్కొక్కటిగా కౌంట్‍ చేసేవారు. ఇప్పుడు ప్రత్యేక ఎలక్ట్రిక్ జల్లెడ మెషీన్లు ఉపయోగించారు. వీటిలో హుండీలను వేయగానే బియ్యం, నోట్లు, నాణేలు సపరేట్అయ్యాయి. దీంతో సమయం వృథా కాలేదు. వచ్చిన ఆదాయాన్ని ఎండోమెంట్ డిపార్ట్​మెంట్ బ్యాంక్ అకౌంట్​లో జమ చేసినట్లు డిప్యూటీ కమిషనర్‍ రామల సునీత, మేడారం ఆలయ ఈవో వీరస్వామి తెలిపారు.

8 రోజుల హుండీల లెక్కింపు వివరాలు

మొదటి రోజు – 125 హుండీలు – రూ.2 కోట్ల 49 లక్షల 65 వేలు
రెండోరోజు – 160  హుండీలు – రూ.3 కోట్ల 54 లక్షల 25 వేల 200, ఫారిన్ కరెన్సీ రూ.63,436
మూడోరోజు – 140 హుండీలు – రూ.2 కోట్ల 01 లక్ష 21 వేల 440, ఫారిన్ కరెన్సీ రూ.71,283
నాలుగో రోజు – 200 హుండీలు –  రూ.2 కోట్ల 64  లక్షల 75 వేల 757 
ఐదో రోజు – 163 హుండీలు – రూ.కోటి 12 లక్షల 63 వేలు
ఆరో రోజు– 40 హుండీలు – రూ.80,81, 935 
ఏడోరోజు – రూ.61,16,218  - ఎనిమిదో రోజు – రూ.4,56,399