హసన్ పర్తి, వెలుగు : వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి నియోజకవర్గంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
5వ డివిజన్ పరిధిలో రూ.90 లక్షలతో మర్కజీ స్కూల్ నుంచి మంగలి వాగు బ్రిడ్జి వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు, 30వ డివిజన్ చిల్డ్రన్ పార్కులో రూ.70లక్షలతో చేపట్టనున్న మౌలిక వసతుల కల్పన పనులకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు పోతుల శ్రీమన్నారాయణ, రావుల కోమల, డివిజన్ అధ్యక్షుడు స్రవంతి, రమేశ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
