- నేడు అదుపులోకి తీసుకోనున్న పేట్‌బషీరాబాద్ పోలీసులు
- కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణలో విచారణ
హైదరాబాద్, వెలుగు: పోక్సో కేసులో బండి భగీరథ్‌ను పేట్ బషీరాబాద్ పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. బుధవారం ఉదయం నుంచి మొత్తం మూడు రోజుల పాటు తమ కస్టడీలో విచారించనున్నారు. ఈ మేరకు కస్టడీకి అనుమతిస్తూ మేడ్చల్ జిల్లా మొదటి అదనపు సెషన్స్ కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో చర్లపల్లి సెంట్రల్ జైలు రిమాండ్‌లో ఉన్న భగీరథ్‌ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు.
బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిచడంతో పాటు.. అత్యాచారం చేశాడనే ఆరోపణలతో బండి భగీరథ్‌ను ఈ నెల 16న రాత్రి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అదే రోజు రిమాండ్‌కు తరలించడంతో నిందితున్ని పూర్తి స్థాయిలో విచారించే అవకాశం లేకుండా పోయిందని, మరిన్ని ఆధారాలు సేకరించేందుకు వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించాలని కోరుతూ.. పేట్‌బషీరాబాద్ పోలీసులు న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు.
కాగా.. తన క్లయింట్‌పై వస్తున్న ఆరోపణలు నిజంకాదని, కుట్రపూరితంగా చేశారని బెయిల్ మంజూరు చేయాలని భగీరథ్ తరఫున అడ్వకేట్స్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్‌లపై మంగళవారం వాదనలు విన్న మేడ్చల్ జిల్లా న్యాయస్థానం పోలీసుల వాదనతో ఏకీభవించింది. బండి భగీరథ్‌ను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది.
