ఫేక్ డాక్టర్లపై కొరడా .. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో మెడికల్ కౌన్సిల్ దాడులు

ఫేక్ డాక్టర్లపై కొరడా ..    మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో మెడికల్ కౌన్సిల్ దాడులు
  •     8 మందిపై కేసులు నమోదు

కీసర, వెలుగు: ఫస్ట్​ ఎయిడ్​ సెంటర్లను ఏర్పాటు చేసి హాస్పిటల్స్​ తరహాలో వైద్య సేవలు అందిస్తున్న నకిలీ డాక్టర్లపై తెలంగాణ మెడికల్​ కౌన్సిల్(టీజీఎంసీ) కొరడా ఝులిపించింది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో టీజీఎంసీ శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించింది. 

కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ జి.శ్రీనివాస్, సభ్యుడు డాక్టర్ ఇమ్రాన్ అలీ నేతృత్వంలో తనిఖీలు చేశారు. మోడర్న్ మెడిసిన్ పేరుతో చట్టవిరుద్ధంగా క్లినిక్‌లు నడుపుతున్న ఎనిమిది మందిని గుర్తించారు. ఇందులో కొందరు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పేరు పెట్టుకొని హాస్పిటల్స్​ మాదిరిగా బెడ్లు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. 

అర్హత లేనప్పటికీ చికిత్స అందిస్తున్నందున వారిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జి. శ్రీనివాస్ మాట్లాడుతూ.. అనధికారంగా వైద్యం చేస్తే ఏడాది జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల వరకు జరిమానా ఉంటుందని చెప్పారు. ఎక్కడైనా అనర్హులు వైద్యం చేస్తే 91543 82727 నంబర్​కు సమాచారం ఇవ్వాలని సూచించారు. 

పట్టుబడిన నకిలీ డాక్టర్లలో భవాని క్లినిక్ రమేశ్(కిస్మత్‌పుర), హోప్ పాలీక్లినిక్ జ్యోతి(కిస్మత్‌పుర), కోట రాంబాబు(కీసర), ఫస్ట్ ఎయిడ్ సెంటర్ భాస్కర్(కీసర), మణికంఠ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కృష్ణారెడ్డి(కీసర), లైఫ్ సేవ్ మెడికల్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ బండ్లగూడ నిర్వాహకుడు(కీసర), లలిత క్లినిక్ వెంకటయ్య(కందుకూరు ఎక్స్ రోడ్డు), ఫస్ట్ ఎయిడ్ సెంటర్ సరిత గౌడ్(కిస్మత్‌పుర)
ఉన్నారు.