
- ఘరానా దొంగ, అతడికి సహకరించిన మహిళ అరెస్ట్
- రూ.10 లక్షల విలువైన బంగారం, వెండి, 4 బైక్‌లు స్వాధీనం
జీడిమెట్ల, వెలుగు: ఇండ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని, అతడికి సహకరిస్తున్న మహిళను మేడ్చల్ సీసీఎస్, దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం పేట్ బషీరాబాద్‌లోని డీసీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేడ్చల్ డీసీపీ శబరీశ్ వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా ఆనంద్‌నగర్‌కు చెందిన పండరి స్వామి (25) జల్సాలకు బానిసై చోరీలు చేస్తున్నాడు. అతడిపై గతంలోనే 24 కేసులు ఉన్నాయి.
ఇటీవల జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత మళ్లీ దొంగతనాలు మొదలుపెట్టాడు. దుండిగల్ పరిధి మల్లంపేట బీసీ కాలనీలో ఉంటూ నిర్మాణ కూలీగా పని చేస్తూ మరో 13 చోరీలు చేశాడు. దొంగతనం చేసిన బంగారం, వెండి, ఎలక్ట్రానిక్ సామగ్రి, ఇతర వస్తువులను అదే ఏరియాలో ఉంటున్న రహీమా బేగం(44)కు ఇచ్చి ఆమె ద్వారా వాటిని ఇతర ప్రాంతాల్లో అమ్మించేవాడు. బుధవారం పోలీసులు మల్లంపేటలో తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా బైక్ పై వస్తున్న స్వామి, రహీమాను ఆపేందుకు యత్నించారు. స్వామి బైక్‌ను ఆపకుండా వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు వెంబడించి వారిని పట్టుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారించగా.. స్వామి దొంగతనాల విషయం బయటపడింది.
ALSO READ:హార్డ్‌వేర్ పార్క్ భూబాధితుల సమస్యలు పరిష్కరించాలి: కోదండరాం
దుండిగల్, సూరారం, బాచుపల్లి, ఐడీఏ బొల్లారం పీఎస్‌ల పరిధిలో 13 చోరీలకు పాల్పడినట్లు స్వామి పోలీసులకు తెలిపాడు. గతంలో అతడిపై నిజామాబాద్ జిల్లాలో 17, జీడిమెట్ల పీఎస్ పరిధిలో4, దుండిగల్ పీఎస్ పరిధిలో 3 కేసులు.. మొత్తం 24 కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 80 గ్రాముల బంగారం, 359 గ్రాముల వెండి, 4 బైక్ లు, 4 ల్యాప్‌టాప్‌లు, 7 విద్యుత్ వైర్ల బండిల్స్, 6 స్పీకర్లను స్వాధీనం చేసుకున్నారు.