హార్డ్​వేర్​ పార్క్​ భూబాధితుల సమస్యలు పరిష్కరించాలి: కోదండరాం

హార్డ్​వేర్​ పార్క్​ భూబాధితుల సమస్యలు పరిష్కరించాలి: కోదండరాం

హైదరాబాద్​, వెలుగు : రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్ల, నాదర్గుల్, ఎంఎం కుంట గ్రామాల్లో హార్డ్​వేర్ పార్క్ నిర్మాణం కోసం 2004లో విడుదల చేసిన భూసేకరణ నోటిఫికేషన్​ను వెనక్కి తీసుకోవాలని వక్తలు డిమాండ్​ చేశారు. భూ బాధితుల సమస్య పరిష్కరించాలని, లేకపోతే సెక్రటేరియెట్​ను ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టీఎస్ఐఐసీ, సీసీఎల్, హెచ్ఎండీఏలోని సంబంధిత అధికారులకు వినతిపత్రాలు ఇవ్వాలని, రీలే దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. 

బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని చెప్పారు. హార్డ్​వేర్ పార్క్ వ్యతిరేక పోరాట సమితి, రంగారెడ్డి జిల్లా తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో ‘హార్డ్​వేర్ పార్క్ హఠావో – తెలంగాణ బచావో’ పేరుతో బుధవారం హైదరాబాద్​లోని సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో అఖిలపక్షం రౌండ్​ టేబుల్ సమావేశం జరిగింది.

భూములను వెంటనే రైతుల పేరు మీదికి మార్చాలి: కోదండరాం

రౌండ్​టేబుల్​ సమావేశంలో టీజేఎస్​ చీఫ్ ​ప్రొఫెసర్​ కోదండరాం మాట్లాడుతూ... హార్డ్​వేర్ పార్క్ నిర్మాణం కోసం మొత్తం 5వేల ఎకరాల సేకరణకు 2004లో అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని, అందులో 2వేల ఎకరాలు అసైన్డ్ భూమి కాగా, మిగతా 3 వేల ఎకరాలు రైతులకు చెందిన పట్టా భూమి అని తెలిపారు. రైతుల సమ్మతి లేకుండా ప్రభుత్వం ఏకపక్షంగా భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేసిందని, పట్టాదారులకు ఎలాంటి నష్టపరిహారాన్ని చెల్లించ లేదన్నారు.   

ALSO READ: ముంబైలో భారీ ల్యాండ్​ డీల్.. 22 ఎకరాలను రూ. 5 వేల 200 కోట్లు

అలా ఉంటే భూ సేకరణ చేయొద్దు: కోదండరెడ్డి

జీవో నంబర్ 20(2013) ప్రకారం పొల్యూషన్ విడుదల చేసే ఇండస్ట్రీలను రింగ్ రోడ్ లోపల నిర్మించకూడదని, అట్లనే 60శాతం మంది రైతులు వ్యతిరేకిస్తే ఎలాంటి భూసేకరణ చేయకూడదని కాంగ్రెస్ సీనియర్ నేత, జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. టైటిల్ గ్యారెంటీ, సర్వే కోసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 80 కోట్లు కేటాయించిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం అందులోంచి ఒక్క రుపాయి కూడా ఖర్చు చేయలేదని తెలిపారు. 

కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యా పారం చేస్తున్నదని మండిపడ్డారు. సమావేశంలో సీసీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నేత గోవర్ధన్​, హార్డ్ వేర్ పార్క్ వ్యతిరేక పోరాట జేఏసీ చైర్మన్ రామేశ్వర్ రావు, కన్వీనర్ దార సత్యం, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, కార్పొరేటర్ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

ధరణితో ఇబ్బంది పెడ్తున్నరు: రాంచందర్రావు

ధరణి పేరుతో ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తున్నదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్​ రావు అన్నారు. భూ బాధితులకు 4 రేట్లు అధికంగా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.