మెడికల్ కంటిన్జెన్సీ ఫండ్ అంటే ఏంటి..? హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నోళ్లకు కూడా ఇది అవసరమా..?

మెడికల్ కంటిన్జెన్సీ ఫండ్ అంటే ఏంటి..? హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నోళ్లకు కూడా ఇది అవసరమా..?

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దోళ్లు. కానీ ఆ ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు మన జేబు ఖాళీ కాకుండా చూసుకోవడం అంతకంటే ముఖ్యం. చాలామంది ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసేసుకుంటే చాలు.. ఇక ఏ ఆపద వచ్చినా డోకా లేదు అని ధీమాగా ఉంటారు. కానీ అది ఒక భ్రమ మాత్రమే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్య ద్రవ్యోల్బణం, పాలసీలో ఉండే లోపాలు, జేబులోంచి పెట్టాల్సిన అదనపు ఖర్చులు మన ఆర్థిక ప్రణాళికను తలకిందులు చేయగలవు. అందుకే కేవలం హెల్త్ ఇన్సూరెన్స్ పైనే ఆధారపడకుండా మెడికల్ బ్యాకప్ ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో అసలు నిజాలేంటో ఒకసారి చూద్దాం..

ఇన్సూరెన్స్ ఉంటే సరిపోదు..
దేశంలో మెడికల్ ద్రవ్యోల్బణం ఏటా 12-14 శాతం పెరుగుతోంది. అంటే ఈ రోజు 10 లక్షల రూపాయల ఖర్చయ్యే వైద్యం.. మరో ఐదేళ్లలో దాదాపు రెట్టింపు అవ్వచ్చు. కేవలం 10 లక్షల పాలసీ ఉందని నిశ్చింతగా ఉంటే.. భవిష్యత్తులో అది ఏ మూలకు సరిపోకపోవచ్చు. అలాగే దాదాపు 40% వైద్య ఖర్చులు ఇప్పటికీ సామాన్యులు తమ సేవింగ్స్ నుంచే చెల్లిస్తున్నారు. దీనికి కారణం పాలసీలు అన్నింటినీ కవర్ చేయకపోవడమే.

కంటికి కనిపించని ఖర్చులు..
ఆసుపత్రిలో అడ్మిట్ అయినప్పుడు బెడ్ చార్జీలు, డాక్టర్ ఫీజులు ఇన్సూరెన్స్ కంపెనీ కడుతుంది. కానీ కన్జ్యూమబుల్స్ అంటే గ్లౌజులు, మాస్కులు, సర్జికల్ వస్తువులు, ప్రత్యేక డయాగ్నస్టిక్ టెస్టులు, రూమ్ రెంట్ క్యాపింగ్ వంటివి పాలసీహోల్డర్ల జేబుకు చిల్లు పెడతాయి. బిల్లులో ఇవి దాదాపు 5-15% వరకు ఉంటాయి. అంతేకాదు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక వాడే మందులు, ఫాలో-అప్ చెకప్‌ల ఖర్చును చాలా పాలసీలు భరించవు. ఇక్కడే మన మెడికల్ బ్యాకప్ ఫండ్ అండగా నిలుస్తుందన్నమాట.

లిక్విడిటీ vs ప్రొటెక్షన్..
ఇన్సూరెన్స్ అనేది కేవలం పెద్ద ఆసుపత్రి బిల్లుల నుంచి మాత్రమే రక్షణ కల్పిస్తుంది. కానీ అనారోగ్యం సమయంలో ఆదాయం కోల్పోవడం, ఇంటి వద్ద రికవరీ కోసం అయ్యే ఖర్చులు, ప్రయాణ ఖర్చులకు ఇన్సూరెన్స్ పనికిరాదు. అందుకే ప్రతి కుటుంబం కనీసం 6 నుండి 12 నెలల ఖర్చులకు సరిపడా క్యాష్ 'లిక్విడ్ రిజర్వ్'గా పెట్టుకోవాలి. ఇది ఒక హెల్త్ ఎమర్జెన్సీ వల్ల మీ దీర్ఘకాలిక పెట్టుబడులు, డిపాజిట్లు, బంగారం లాంటి వాటిని అమ్ముకోకుండా కాపాడుతుంది.

►ALSO READ | ఆంత్రోపిక్ కొత్త ఏఐ టూల్: ఏఐ Vs సైబర్ సెక్యూరిటీ కంపెనీలు.. యుద్ధం మొదలైంది..?

చేయాల్సిన 'మెడికల్ బ్యాకప్' ప్లాన్..
మీ పాలసీ ఎంత ఉందో.. అందులో సుమారు 40-50% మొత్తాన్ని విడిగా ఒక మెడికల్ కంటింజెన్సీ ఫండ్‌గా దాచిపెట్టుకోవాలి. ఉదాహరణకు మీకు 10 లక్షల హెల్త్ పాలసీ ఉంటే.. ఒక 5 లక్షల రూపాయలను అత్యవసర నిధిగా పక్కన పెట్టడం మంచిది. ముఖ్యంగా వృద్ధులు, రిటైర్డ్ వ్యక్తులకు ఈ ఫండ్ కింద సేవింగ్స్ మరింత ఎక్కువగా ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఆర్థిక రక్షణ కవచంలో ఫస్ట్ సేఫ్టీ నెట్ మాత్రమే. కానీ అది పూర్తి రక్షణ కాదు. ఆరోగ్య అత్యవసర స్థితి అనేది చెప్పి రాదు.. కానీ దానికి సిద్ధంగా ఉండటం మన చేతుల్లోనే ఉంది. ఇన్సూరెన్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేస్తూ.. సమాంతరంగా ఒక ఎమర్జెన్సీ ఫండ్‌ను సిద్ధం చేసుకోవటం కీలకం.