హైదరాబాద్ లో రూపాయికే వైద్య సేవలు..

హైదరాబాద్ లో  రూపాయికే వైద్య సేవలు..

ముషీరాబాద్, వెలుగు: వైద్యం వ్యాపారంగా మారిపోయింది. ఆస్పత్రుల్లో చేరితే లక్షల్లో ఖర్చవుతోంది. కొన్ని సందర్భాల్లో ఆస్తులు అమ్ముకొని ఆస్పత్రి బిల్లులు కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితిల్లో ఓ ఆస్పత్రి అతి తక్కువ ధరకు వైద్యం అందిస్తోంది. జీజీ చారిటీ ఆసుపత్రి నిరుపేదలకు కేవలం ఒక్క రూపాయికే వైద్యం అందించేందుకు నడుం కట్టింది. రూపాయికే డాక్టర్ కన్సల్టెన్సీ కాగా.. మందులు, ల్యాబ్ టెస్టుల్లో 50 శాతం రాయితీ కల్పిస్తూ మానవతా దృక్పథాన్ని చాటుతోంది. ఈ దవాఖానాను పేద ప్రజల కోసం రాం నగర్ గుండులో సొంతంగా నిర్వహిస్తున్నారు. పైడి రాకేశ్ రెడ్డి ఫౌండేషన్ నైన్ స్టార్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బాగ్ లింగంపల్లిలోనూ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. 

ప్రస్తుతం ఓపీ సేవలు

జీ చారిటీ ఆస్పత్రిలో ప్రస్తుతం గైనకాలజిస్ట్, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్, కార్డియాలజీ, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ, యూరాలజీ, ఈఎన్‌టీ, డెంటల్, గ్యాస్ట్రో ఎంటరాలజీ, న్యూరాలజీ, జనరల్, శ్వాస సంబంధ తదితర 18 రకాల ఓపీ సేవలు అందుబాటులో ఉన్నాయి. రాం నగర్‌‌లో 50 పడకలతో నిర్మించి ప్రారంభించినప్పటికీ ప్రస్తుతానికి అవుట్ పేషెంట్ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆసుపత్రికి వచ్చిన ప్రతి రోగి తన పేరు నమోదు చేసుకున్న తర్వాత రిసెప్షన్‌లో ఉన్న హుండీలో ఒక్క రూపాయి నుంచి మొదలుకొని తోచినంత వేయవచ్చు. రోగికి వ్యాధి నిర్ధారణ అయ్యాక అవసరమైతేనే ల్యాబ్‌ టెస్టులు రాస్తారు. ఈ టెస్టుల్లో కూడా 50 శాతం రాయితీ ఇస్తున్నారు. అలాగే డాక్టర్ రాసిచ్చిన మందుల్లో కూడా 40 శాతం వరకు రాయితీ కల్పిస్తున్నారు. ఇక్కడకు రాష్ట్రంలోని ప్రజలతో పాటు కర్నాటక, మహారాష్ర్ట, బిహార్, ఒరిస్సా రాష్ర్టాల నుంచి కూడా రోగులు వస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి తక్కువ ఖర్చుతో భోజన సదుపాయం కూడా అందిస్తున్నారు. రూపాయి హుండీలో వేయమన్నారు..మాది ఇబ్రహీంపట్నం దగ్గర తాళ్లగూడెం. మాకు తెలిసిన వారు చెప్తే ఇక్కడకు వచ్చినం. ఇచ్చే ఫీజు రూపాయి కూడా హుండీలో వేసిన. డాక్టర్ మంచిగా చూసిండు. టిఫిన్, భోజనం పెట్టిర్రు. మాలాంటి వాళ్లకు ఇసువంటి ఆసుపత్రి ఉండాలె. ‌‌ 
- భారతమ్మ , పేషెంట్

అప్పుడు చలించిపోయా..

కరోనా సమయంలో గాంధీ ఆస్పత్రికి వచ్చే రోగులను చూశాక చలించిపోయాను. వైద్యంతో ప్రజలకు సేవ చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నా.  వ్యాపారంలో మంచిగా స్థిరపడ్డ నేను సంపాదించిన దాంట్లో కొంతైనా ప్రజలకు వినియోగించాలనుకున్నా. పెద్దల సూచనతో ఈ ఆస్పత్రి ఏర్పాటు చేశా. ప్రస్తుతం ఆస్పత్రికి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. రాబోయే రోజుల్లో రోగులకు మరిన్ని సేవలను అందుబాటులోకి తెస్తా. మెడిసిన్స్​పై మాకు వచ్చే డిస్కౌంట్ తీసేసి రోగులకే డిస్కౌంట్ ఇస్తున్నాం. నేను చేస్తున్న సేవకు పైడి రాకేష్ రెడ్డి ఫౌండేషన్‌తో పాటు దాతలు కూడా ముందుకు రావడం సంతోషంగా ఉంది.
- గంగాధర్‌ గుప్తా, జీజీ చారిటీ ట్రస్ట్ చైర్మన్‌ 

పేదలకు కార్పొరేట్  వైద్యం  అందించాలనే..

మారుమూల ప్రాంతాల పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్న లక్ష్యంతో ఒక్క రూపాయికే వైద్యం అందిస్తున్నాం. విద్య, వైద్యం సమాజానికి ఉపయోగపడాలన్న లక్ష్యంతో జీజీ చారిటీ, రాకేష్ రెడ్డి ఫౌండేషన్, నైన్ స్టార్ ఆసుపత్రుల సంయుక్తంగా బాగ్ లింగంపల్లిలో ఏర్పాటు చేశాం.
‌‌ - పైడి రాకేశ్ రెడ్డి, ట్రస్ట్ వ్యవస్థాపకులు