వైద్య విద్యార్థి ప్రాణాలు తీసిన ప్రియుడు..మియాపూర్ హోటల్గదిలో ఘటన

వైద్య విద్యార్థి ప్రాణాలు తీసిన ప్రియుడు..మియాపూర్ హోటల్గదిలో ఘటన
  • బంగారు గొలుసు ఇస్తానని హన్మకొండ నుంచి ..
  • హైదరాబాద్​కు రప్పించి హత్య
  •     పరారీలో నిందితుడు..పోలీసుల గాలింపు

మియాపూర్, వెలుగు: తాను ఇచ్చిన బంగారు గొలుసును తిరిగి ఇస్తానని హోటల్​కు రప్పించి పీజీ వైద్య విద్యార్థిని బాయ్​ఫ్రెండ్​ హత్య చేసిన ఘటన హైదరాబాద్​లోని మియాపూర్​లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం..సంగారెడ్డి పట్టణం శాంతినగర్​కు చెందిన కోమటి భూమయ్య రెండో కూతురు సృజన(27) ప్రస్తుతం హన్మకొండలో పీజీ ఫస్టియర్ ​చదువుకుంటూ ఓ హాస్పిటల్​లో పీడియాట్రీషన్​గా పనిచేస్తోంది. 

మహబూబ్​నగర్​లోని ప్రభుత్వ వైద్య కాలేజీలో ఎంబీబీఎస్​ చదువుతున్న సమయంలో సృజనకు మహబూబ్​నగర్​అమర​చింత ప్రాంతానికి చెందిన రవికుమార్(30)తో ఇన్​స్టాగ్రామ్​లో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. 

రవికుమార్​ హైదరాబాద్​లో క్యాబ్ నడుపుతూ విలాసాల కోసం అప్పులు చేశాడు. దాదాపు రూ.30 లక్షల వరకు అప్పులు చేశాడు. కాగా తన వైద్య విద్య పూర్తవుతుందని, మంచి ఉద్యోగం చేయాలని, జీవితంలో సెటిల్​కావాలని రవికుమార్​కు సృజన సూచించేది. ఈ విషయంలో ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో నెల రోజులుగా రవికుమార్​తో సృజన మాట్లాడడంలేదు. 

బంగారు గొలుసు ఇస్తానని నగరానికి రప్పించి..

గతంలో సృజన వద్ద నుంచి తాను తీసుకున్న బంగారు గొలుసు ఇస్తానని, హైదరాబాద్​కు రావాలని రవికుమార్ ​చెప్పాడు. సెప్టెంబర్​ 29వ తేదిన హఫీజ్​పేట్ ​మార్తండ నగర్​లోని గ్రాండ్​బ్రోహోలిక్​ లగ్జరీ హోటలో ఓ రూమ్​ను అద్దెకు తీసుకొని మరో స్నేహితుడితో కలిసి ఉన్నాడు. 30వ తేదీన ఉదయమే​స్నేహితుడు బయటకు వెళ్లిపోయాడు. 

గొలుసు తెచ్చుకునేందుకు హైదరాబాద్​ వెళ్తున్నానని తన రూమ్మేట్స్​కు చెప్పిన సృజన 30వ తేదీన సాయంత్రం బయలుదేరి నగరానికి చేరుకుంది. అయితే 1వ తేదీ నుంచి ఫోన్​కాల్స్​కు సృజన రెస్పాన్స్​ కాకపోవడంతో విషయాన్ని స్నేహితులు ఆమె తండ్రి భూమయ్యకు తెలియజేశారు. దీంతో భూమయ్య హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ ​కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫోన్ ​సిగ్నల్​ఆధారంగా మియాపూర్​లో ఉన్నట్లు గుర్తించి శుక్రవారం ఉదయం గ్రాండ్​ బ్రోహోలిక్​ హోటల్​కు చేరుకున్నారు. 

రూమ్​బయట నుంచి తాళం పెట్టి ఉండడంతో హోటల్​ సిబ్బంది మరో తాళం చెవితో గది తలుపులు తెరిచి చూడగా బెడ్​పై సృజన విగతజీవిగా కనిపించింది. రెండ్రోజుల క్రితమే మృతిచెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. డెడ్​బాడీని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మియాపూర్​ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 

సీసీ కెమెరాలను పరిశీలించగా గురువారం ఉదయమే రవికుమార్​ హోటల్​గది నుంచి బయటకు వెళ్లినట్లు గుర్తించారు. హత్య చేసి పారిపోయినట్లు అనుమానిస్తున్న పోలీసులు గాలిస్తున్నాయి. ఏపీలోని కర్నూలుకు వెళ్లిన రవికుమార్.. బంధువుల ఇంట్లో సెల్ ఫోన్ పెట్టి సిమ్ తన వెంట తీసుకొని వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు.