
- సగానికి ఫీజులు తగ్గించిన
- ఓ కార్పొరేట్ హాస్పిటల్
- వైద్య వర్గాల్లో చర్చనీయాంశంగా హాస్పిటల్ నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ ఫీజులను సగానికి తగ్గించడం చర్చనీయాంశంగా మారింది. ఓ జాతీయ పార్టీకి చెందిన మహిళా నాయకురాలి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ హాస్పిటల్.. కన్సల్టేషన్ ఫీజుల దగ్గర నుంచి ఎంఆర్‌ఐ స్కానింగ్ వరకు అన్నింటి రేట్లను సగానికి పైగా తగ్గించింది. ఎక్స్ రేకు రూ.99, కన్సల్టేషన్‌కు రూ.199, అల్ట్రా సౌండ్ కు రూ.499, సిటీ స్కాన్ కు రూ.999, ఎంఆర్ఐకి రూ.1,999, ఆంజియోగ్రామ్ కు రూ.4999 మాత్రమే తీసుకుంటున్నట్లు హాస్పిటల్ బయట బోర్డులు ఏర్పాటు చేసింది.
అలాగే, రొటీన్ బ్లడ్ టెస్టులకు రూ.299, ఫార్మసీపై 20 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది.కరోనా సమయంలో ఆక్సిజన్, వెంటిలేషన్ పేర్లతో అడ్డగోలు దోపిడీకి పాల్పడిందన్న ఆరోపణలు ఎదుర్కొన్న ఈ ఆసుపత్రి, ఒక్కసారిగా ధరలు తగ్గించడంపై హైదరాబాద్ వైద్యవర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. ఆ మచ్చను తొలగించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని కొందరు అంటుంటే.. మార్కెటింగ్ స్ట్రాటజీ అని మరికొందరు అంటున్నారు. సదరు మహిళా నేత రాజకీయ ఎదుగుదల కోసం పన్నిన వ్యూహమని ఇంకొందరు చర్చించుకుంటున్నారు.