- బీ' కేటగిరీలో నాలుగున్నరేండ్లకే ఫీజులు తీసుకోవాలని డిమాండ్
- ప్రభుత్వ జీవోలను లెక్కచేయని కాలేజీలపై ఎన్ఎంసీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యార్థుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై కోర్టుకు వెళ్తామని మెడికో పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం వెల్లడించింది. బీ కేటగిరీలో నాలుగున్నరేండ్ల కాలానికి మాత్రమే ఫీజు తీసుకోవాలని ప్రభుత్వం, ఎఫ్ఆర్సీ స్పష్టం చేసినప్పటికీ.. కొన్ని కాలేజీలు ఐదేండ్ల ఫీజు తప్పనిసరిగా కట్టాలని మొండిగా వేధిస్తున్నాయని ఆరోపించింది. ఆదివారం హైదరాబాద్ బండ్లగూడలో మెడికో పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు మల్లోజు సత్యనారాయణ చారి మాట్లాడుతూ ప్రభుత్వ జీవోలను లెక్కచేయని కరీంనగర్‌లోని చల్మెడ కాలేజీపై ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటువంటి కాలేజీలపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకు వెళ్లి అయినా మెడలు వంచి, నాలుగున్నరేండ్లకే ఫీజులు తీసుకునేలా ఒప్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ కాలేజీలు అంగీకరించని పక్షంలో జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ)కి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
కరీంనగర్‌లో బహిరంగ సభ
చల్మెడ కాలేజీ మొండి వైఖరికి నిరసనగా త్వరలోనే పేరెంట్స్ అందరూ కలిసి కరీంనగర్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని అసోసియేషన్ నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నీట్ ఎగ్జామ్‌లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా పరీక్ష సమయంలో విద్యార్థులకు సమయం వృధా కాకుండా ఉండేందుకు.. సంతకాలు, వేలిముద్రలను ఎగ్జామ్ సమయానికంటే ముందుగానే తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
