బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఏఐ అభ్యర్థి

బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఏఐ అభ్యర్థి
  • తన అవతార్ ఫొటోతో ‘ఏఐ స్టీవ్’ పేరిట బరిలోకి దిగిన బిజినెస్​మాన్ 
  • స్పెషల్ పర్మిషన్ ఇచ్చిన యూకే ఎలక్షన్ కమిషన్  
  • గెలిస్తే ప్రపంచంలోనే మొట్టమొదటి 'ఏఐ లామేకర్'గా గుర్తింపు

లండన్: మెడికల్‌‌, టెక్నాలజీ, వ్యవసాయం వంటి రంగాల్లో అద్భుత ఫలితాలు ఇస్తున్న ఆర్టిఫిషియల్‌‌ ఇంటెలిజెన్స్‌‌-(ఏఐ).. ఇప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశింది. అవును. ప్రపంచంలోనే మొట్టమొదటి ‘ఏఐ పొలిటీషియన్’ బ్రిటన్  ఎన్నికల్లో  అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జులై 4న జరగనున్న బ్రిటన్‌‌ జాతీయ ఎన్నికల్లో వందలాది మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. వారిలో వ్యాపారవేత్త స్టీవ్ ఎండాకాట్(59) కూడా ఒకరు. అయితే, బ్రైటన్ పెవిలియన్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన.. వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. కరపత్రాల్లో తన ముఖానికి బదులు.. తనను పోలిన ఏఐ అవతార్ ను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. బ్యాలెట్ పత్రాలపైనా స్టీవ్ ఎండాకాట్ అవతార్ ఫొటోతోపాటు ఆయన పేరు "ఏఐ స్టీవ్"గానే కనిపించనుంది. దానికోసం స్టీవ్ ఎండాకాట్ ఎన్నికల అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో  "ఏఐ స్టీవ్" అనే ఆర్టిఫిషియల్‌‌ ఇంటెలిజెన్స్‌‌ అభ్యర్థి గెలిస్తే.. పార్లమెంటు సభ్యునిగా స్టీవ్ ఎండాకాట్ గెలిచినట్టేనని అధికారులు తెలిపారు.  

ఆలోచన ఎలా వచ్చిందంటే..

స్టీవ్ ఎండాకాట్ 2022లో కన్జర్వేటివ్ పార్టీ తరఫున బ్రైటన్ పెవిలియన్ నియోజకవర్గంలో పోటీ చేశారు. ప్రచారంలో  ఆయన ప్రజలందరినీ కలుసుకోలేకపోయారు. ఫలితంగా ఎన్నికల్లో ఓడిపోయారు. ఈసారి కూడా  అదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా మళ్లీ పోటీలోకి దిగారు. గతంలో చేసిన తప్పు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈసారి చేసే ప్రచారంతో ప్రజల అటెన్షన్ అంతా తన మీదే ఉండాలని, అందరి మద్దతును కూడగట్టుకోవాలని అనుకున్నాడు. ఏఐ అద్భుతాల గురించి తెలుసుకుని దాన్ని రాజకీయంగా ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. ప్రజలు తమ సమస్యలను చెప్పగానే పరిష్కారం చూపేలా "ఏఐ స్టీవ్" అనే వెబ్ సైట్ ను కూడా ఆయన సిద్ధం చేసుకున్నాడు. 

'ఏఐ స్టీవ్' పని చేసేది ఇలా..

స్టీవ్ ఎండకాట్ తన నియోజకవర్గ ప్రజలతో  నిరంతరం కమ్యూనికేషన్‌‌ను కొనసాగించడానికి 'ఏఐ స్టీవ్' అనే వెబ్‌‌సైట్ రూపొందించారు. ప్రజలు తమ సమస్యలపై ఏఐ స్టీవ్ ద్వారా నేరుగా ఎండాకాట్ తో చర్చించే అవకాశం ఉంటుంది. ఎండకాట్ తాను తీసుకునే నిర్ణయాలపై ప్రజల అభిప్రాయాలను కూడా సేకరిస్తారు. 50 శాతం మంది ప్రజలు ఆమోదిస్తేనే కొత్త స్కీమ్, పాలసీ అమలులోకి వస్తుంది. ఇలా.. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతిస్పందించే రాజకీయ నాయకుడిని సృష్టించడమే ఏఐ స్టీవ్ ముఖ్య ఉద్దేశం. 

జనం నుంచి మిశ్రమ స్పందన

ఏఐ అభ్యర్థిపై జనం నుంచి మాత్రం మిశ్రమ స్పందన వస్తున్నది. చాలా మంది ఇది వినూత్న ఆలోచనే అయినా.. ఏఐ అవతార్ కు ఓట్లు పడకపోవచ్చని అంటున్నారు. ఏఐని  రాజకీయాల్లో ఎందుకు ఉంచకూడదని కొందరు అంటుంటే.. ప్రజల తరఫున మాట్లాడాల్సింది ఏఐ కాదని, ఎంపీ  అని మరికొందరు చెప్తున్నారు. కొందరైతే.. ఏఐ, రాజకీయ నాయకులు ఇద్దరూ నమ్మదగినవారు కాదంటూ సెటైర్లు వేస్తున్నారు.

భవిష్యత్తులోనూ ఏఐ అభ్యర్థులనే నిలబెడతా..  

మేం త్వరలో ఓ పొలిటికల్ పార్టీని ప్రారంభించనున్నాం. ఇక నుంచి దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో మా పార్టీ తరఫున ఏఐ అభ్యర్థులనే నిలబెడతాం. ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించిన సరికొత్త ఆలోచన. ఏఐ స్టీవ్ ద్వారా నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం. అది 24/7 వర్క్ చేస్తూనే ఉంటుంది. ప్రజల సలహాలతోనే అభివృద్ధి పనులు చేపడతాం.
-స్టీవ్ ఎండాకాట్