తిరుప్పావై మూడో పాశురం: జీవితమంతాశుభంగా ఉండాలంటే చదవాల్సింది ఇదే..!

తిరుప్పావై  మూడో పాశురం:  జీవితమంతాశుభంగా ఉండాలంటే చదవాల్సింది ఇదే..!

శ్రీరంగనాథస్వామిని స్తుతిస్తూగోదాదేవి రచించిన తిరుప్పావై మూడో పాశురంలో  జీవితమంతా  శుభాలు పొందాలంటే, అందరూ కలిసి వచ్చి, సంపూర్ణంగా స్నానం చేసి,  వ్రతాన్ని ఆచరించాలని ఆండాళ్ గోపికలను ఆహ్వానిస్తోంది. 

మూడవ రోజు పాశురము

ఓట్లీ యులగళన్ద ఉత్తమన్ పేర్ పాడి 
నాఙ్గిళ్ నంబావైక్కు చ్చాత్తినీరాడినాల్
 తీజ్గిని నాడెల్లామ్ తిజ్గిళ్ ముమ్మారిపెయ్ దు
 ఓఙ్గువళై ప్పోదిల్ పొఱివండు కణ్ పడుప్ప 
తేఙ్గాదే పుక్కిరున్దు శీర్ త్తములై పత్తి 
వాఙ్గ- –క్కుడమ్ నిఱక్కుమ్ వళ్ళల్ పెరుమ్ పశుక్కళ్
 నీఙ్గాద శెల్వమ్ నిజైన్దేలో రెమ్బావాయ్.

భావము: ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ సంశ్లేషమే! అయినా దీనిని చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది. బలిచక్ర వర్తి నుండి మూడడుగుల దానాన్ని తీసుకున్న శ్రీకృష్ణ పరమాత్మ అత్యంతానందాన్ని పొంది, ఆకాశమంత ఎత్తుకెదిగి మూడు లోకాలనుకొలిచాడు. ఆ పరమానంద మూర్తి దివ్యచరణా లను, అతని దివ్య నామాలను పాడి, ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గళిస్నానా న్ని ఆచరిస్తే దుర్భిక్షం కలగదు. నెలకు మూడు వర్షాలు కురుస్తాయి. 

పంటలన్నీ త్రివిక్రముడికి మల్లే ఆకాశమంత ఎత్తుకెదిగి ఫలిస్తాయి. పంటచేల మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు త్రుళ్లిపడుతూ ఆనంద సమృద్ధిని సూచిస్తాయి. ఆ నీళ్లలో విరిసిన కలువలను చేరిన భ్రమరాలు మకరందాన్ని తాగి మత్తుగా నిద్రిస్తాయి. ఇవన్నీ సమృద్ధికి సంకేతాలే! ఇక పాలు పితికే గోవుల పొదుగలను తాకగానే కలశాలు నిండుగా క్షీ రధారలు అవిరళంగా వస్తాయి. ఇలా తరగని మహదైశ్వర్యంతోలోకమంతా నిండిపోతుంది. కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సఖులందరినీ పిలుస్తోంది గోద!

శ్రీకృష్ణుడి గొప్పతనాన్ని, ముఖ్యంగా త్రివిక్రమునిగా లోకాన్ని కొలిచిన ఆ గొప్పవాడిని స్తుతిస్తూ, ధనుర్మాస వ్రతం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, అంటే సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు పండి, పాలు పొంగిపొరలి, సంపదలు వెల్లివిరిసి, గోపికలందరూ కలిసి ఆండాళ్‌తో కలిసి పూజ చేస్తారు.  ఈ పాశురం, శ్రీమన్నారాయణుడి గొప్పతనాన్ని, భక్తితో ఆరాధించడం వల్ల కలిగే భౌతిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలను వివరిస్తుంది.