- గాల్లోకి ఆరు రౌండ్ల కాల్పులు జరిపిన పోలీసులు
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పైడిపల్లి పంచాయతీ ఓట్ల లెక్కింపు లో బీజేపీ మద్దతుదారు జక్కుల మమత, బీఆర్‌ఎస్ మద్దతుదారు గంగుల మంగ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థి మంగ 13 ఓట్ల మెజార్టీతో గెలుపొందిందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో మరో బ్యాలెట్ బాక్స్ లోని ఓట్లను లెక్కించకుండానే ఎన్నికల అధికారులు బలవంతంగా ఓటమి పత్రాలపై సంతకాలు తీసుకున్నారని బీజేపీ అభ్యర్థి జక్కుల మమత వర్గం ఆరోపించింది. రీకౌంటింగ్ చేయాలని ఆందోళనకు దిగింది. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. మరోవైపు బ్యాలెట్ బాక్స్‌లను తీసుకెళ్తుండగా మమత వర్గం అడ్డుకోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇరువర్గాలు రాళ్ల దాడికి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాళ్ల దాడిలో జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తలకు గాయమైంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి 6 రౌండ్ల కాల్పులు జరిపారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చాక బ్యాలెట్ బాక్స్‌లను తరలించారు. గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.
