సోనియా, రాహుల్ గాంధీలకు బీజేపీ క్షమాపణ చెప్పాలి..కరీంనగర్ లో కాంగ్రెస్ భారీ ర్యాలీ, ఉద్రిక్తత

సోనియా, రాహుల్ గాంధీలకు బీజేపీ క్షమాపణ చెప్పాలి..కరీంనగర్ లో కాంగ్రెస్ భారీ ర్యాలీ, ఉద్రిక్తత

కరీంనగర్‌లో నేషనల్ హెరాల్డ్ కేసు నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్ర ప్రభుత్వం   సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ భారీ ర్యాలీని నిర్వహించింది.పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసం వరకు ఈ ర్యాలీ కొనసాగింది.కేంద్ర మంత్రి ఇంటిని ముట్టడించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ర్యాలీ బండి సంజయ్ ఇంటి వైపు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

 ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు.సుడా ఛైర్మన్ నరేందర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ సహా పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

ఎటువంటి ఆధారాలు లేకపోయినా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కేంద్రం కక్ష గట్టి కేసులు బనాయిస్తోందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.ఎటువంటి అవినీతి జరగలేదని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసినా, ఇంకా వేధింపులకు గురిచేయడం సరికాదని అన్నారు. ఇన్ని రోజులు గాంధీ కుటుంబాన్ని వేధించినందుకు సోనియా, రాహుల్ గాంధీలకు బీజేపీ నేతలు వెంటనే క్షమాపణ చెప్పాలని  డిమాండ్ చేశారు.