
ఖైరతాబాద్, వెలుగు: అభివృద్ధికి మారుపేరుగా ఉన్న బీఆర్ఎస్కు జనం మరో అవకాశం ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్ లో బీఆర్ఎస్ చేసిన అభివృద్దిని ఆయన వివరించారు. సిటీ అభివృద్ధి కళ్లముందే కనిపిస్తోందన్నారు. కేసీఆర్ విజన్ ఉన్న లీడర్ అని ఆయన పేర్కొన్నారు. సిటీలో అన్ని ప్రాంతాల వారు ఉంటారని.. వారి భద్రత విషయంలో తాము అండగా ఉన్నామనే ధైర్యం నింపామన్నారు.
భూముల ధరల్లో హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీ పడుతోందని చెప్పారు. అంబర్ పేట వద్ద బ్రిడ్జి నిర్మాణం ఎందుకు ఆగిపోయిందని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు తలసాని సమాధానం ఇచ్చారు. అది కేంద్రానికి సంబంధించినదని.. ఇటీవలే కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో ఈ విషయంపై మాట్లాడానని చెప్పారు. తొందరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు మంత్రి తలసాని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ 78 సీట్లను గెలుస్తుందని.. హ్యాట్రిక్ సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.