మెగా కోడలు, టాలీవుడ్ ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠి కొణిదెల సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘సతీ లీలావతి’. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు వేసవి కానుకగా విడుదలకు ముహూర్తం ఖరారు చేసుకుంది. మెగా హీరో వరుణ్ తేజ్‌తో వివాహం, ఆ తర్వాత తల్లిగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన లావణ్యకు, ఇది ‘సెకండ్ ఇన్నింగ్స్’లో అత్యంత కీలకమైన చిత్రం.
మే 8న థియేటర్లలోకి ‘లీలావతి’
గతంలో మార్చి 6న విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. లేటెస్ట్ గా చిత్ర యూనిట్ అధికారికంగా కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. మే 8న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే సెన్సార్ పనులను పూర్తి చేసుకున్న ఈ మూవీ క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్‌ను దక్కించుకుంది..
ఆకట్టుకునే కథాంశం
భార్యాభర్తల మధ్య వచ్చే చిన్నపాటి గొడవలు, ఇద్దరి మధ్య ఉండే సున్నితమైన భావోద్వేగాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో లీలావతిగా లావణ్య త్రిపాఠి నటించగా, ఆమె భర్త పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించారు. ‘శాకుంతలం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దేవ్ మోహన్, ఈ చిత్రంతో మరోసారి తన నటనను నిరూపించుకోనున్నారు. ఒక రొమాంటిక్ రిలేషన్‌షిప్ డ్రామాను వినోదాత్మకంగా మలచడంలో దర్శకుడు తాతినేని సత్య తనదైన ముద్ర వేశారని సమాచారం.
భారీ అంచనాలతో..
‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘ఎస్‌ఎంఎస్’ వంటి హిట్ చిత్రాలను అందించిన తాతినేని సత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో, నాగమోహన్ బాబు, రాజేష్ టి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సీనియర్ నటుడు నరేష్, సప్తగిరి, వి.టి.వి. గణేష్, రాజేంద్రన్ వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. క్లాస్ మెలోడీస్ అందించడంలో స్పెషలిస్ట్ అయిన మిక్కీ జె. మేయర్ ఈ సినిమాకు ప్రాణం పోశారు.
పెళ్లి తర్వాత లావణ్య నటిస్తున్న సినిమా కావడంతో సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్‌పై భారీ బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే చిత్ర యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసి ప్రమోషన్ల హోరును పెంచాలని భావిస్తోంది. మరి ఈ ‘సతీ లీలావతి’తో లావణ్య బాక్సాఫీస్ వద్ద తన మేజిక్‌ను పునరావృతం చేస్తారో లేదో చూడాలి..

