V6 News

Jana Nayagan: ‘జన నాయగన్’ కేసులో ట్విస్ట్.. ఎడిటర్‌ సస్పెండ్.. ఈ టాలెంటెడ్ ప్రదీప్ హిట్ మూవీస్ ఇవే!

Jana Nayagan: ‘జన నాయగన్’ కేసులో ట్విస్ట్.. ఎడిటర్‌ సస్పెండ్.. ఈ టాలెంటెడ్ ప్రదీప్ హిట్ మూవీస్ ఇవే!

సినీ ఇండస్ట్రీ పైరసీ భూతంతో పోరాడుతుంది. కనిపించని ఈ మాయ భూతం, మన చుట్టూ ఉన్నవాళ్ల రూపంలోనే తిరుగుతూ కోట్ల రూపాయల నష్టాలను కలిగిస్తోంది. మేకర్స్ (24 క్రాఫ్ట్స్) మీద నమ్మకం ఉంచిన నిర్మాతలు, నిర్మాతలపై ఆధారపడిన డిస్ట్రిబ్యూటర్లు.. పైరసీ దెబ్బతో తీవ్రంగా నష్టపోతున్నారు. పైరసీని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కఠిన నిబంధనలు తీసుకొచ్చినా, అది పూర్తిగా నియంత్రణలోకి రావడం లేదు.

నిజానికి పైరసీ కొన్ని సంవత్సరాలుగా లేదు. కానీ, 2025 జనవరి నుంచి మాత్రం విచ్చలవిడిగా ఎగబాకింది. ఇటీవల దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా కూడా పైరసీకి గురవడం ఈ సమస్య తీవ్రతను మరోసారి స్పష్టంగా చూపిస్తోంది.

థియేటర్లలో విడుదలకు ముందే పూర్తి సినిమా పైరసీ వెబ్‌సైట్లలో ప్రత్యక్షమవ్వడం నిర్మాతలు మరియు అభిమానులను తీవ్రంగా కలవరపరిచింది. ఈ నేపథ్యంలో నిర్మాతలు KVN ప్రొడక్షన్స్ ఇచ్చిన ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, పలువురిని అరెస్ట్ చేసి న్యాయస్థాన రిమాండ్‌కు పంపించారు. ఈ క్రమంలోనే, ‘జన నాయగన్’ పైరసీ వ్యవహారంలో ఒక కీలక అంశం వెలుగులోకి వచ్చింది.

జన నాయగన్ ఎడిటర్ సస్పెండ్:

దక్షిణ భారత ఫిల్మ్ ఎడిటర్స్ అసోసియేషన్ (SIFEA) కీలక నిర్ణయం తీసుకుంది. జన నాయగన్ మూవీ ఎడిటర్ ప్రదీప్ ఈ. రాఘవ్‌ను (Pradeep E Raghav) అసోసియేషన్ సస్పెండ్ చేసింది. ‘జన నాయగన్’ చిత్రాన్ని ఆన్‌లైన్‌లో అక్రమంగా లీక్ అవ్వకుండా అరికట్టడంలో విఫలమయ్యారని, అలాగే యూనియన్ నియమాలను ఉల్లంఘించారని ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది.

ఏప్రిల్ 17న జరిగిన అత్యవసర కార్యనిర్వాహక కమిటీ సమావేశం అనంతరం, శుక్రవారం ఏప్రిల్ 24న ఈ నిర్ణయం తీసుకుంది. పోలీసుల విచారణలో, ఒక ఫ్రీలాన్స్ ఎడిటర్ అక్రమంగా ఎడిటింగ్ రూమ్‌లోకి ప్రవేశించి సినిమా ఫుటేజీని దొంగిలించినట్లు వెల్లడైంది.

Also Read  :టాలీవుడ్‌కు గ్రహణం.. వరుసగా వాయిదా పడుతున్న స్టార్ హీరోల చిత్రాలు

ఇప్పటికే ప్రధాన నిందితులను అరెస్ట్ చేసినప్పటికీ, మొత్తం బాధ్యత ఎడిటర్‌పైనే ఉంటుందని అసోసియేషన్ భావించింది. సీనియర్ ఎడిటర్లు మరియు కీలక సభ్యులతో కూడిన కమిటీ రాఘవ్ ప్రవర్తనపై సీరియస్‌గా చర్చించింది. చర్చల తర్వాత, ఆయనను సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకుంది.

యూనియన్ నియమాల ఉల్లంఘన..

సిఫియా (SIFEA) ప్రకటనలో, రాఘవ్ ‘జనా నాయగన్’ సహా తన ప్రాజెక్టుల్లో.. అసోసియేషన్ సభ్యులు కాని వారిని అసిస్టెంట్లుగా పెట్టుకున్నారని తెలిపింది. ఇది అసోసియేషన్ నియమాలకు వ్యతిరేకమని, పరిశ్రమ పనితీరును దెబ్బతీసే చర్యగా పేర్కొంది. ఆన్‌లైన్‌లో లీక్ కావడం చిత్రబృందానికి పెద్ద దెబ్బ అని తెలిపింది. అయితే, ఈ లీక్‌కు రాఘవ్ నేరుగా బాధ్యుడు కాదని సిఫియా స్పష్టం చేసినప్పటికీ, పర్యవేక్షణ విధానంలో “నిర్లక్ష్యం” జరిగినట్లు తెలిపింది.

సిఫియా అధికారిక ప్రకటన.

“ఇలాంటి అనవసర ఘటనలు మళ్లీ జరగకుండా ఆపడం మా బాధ్యత. ఈ ధోరణి కొనసాగితే, సినిమా పరిశ్రమ యొక్క పనితీరే ప్రమాదంలో పడుతుంది,” అని అసోసియేషన్ తెలిపింది. ఈ ప్రకటనపై అధ్యక్షుడు వి. గోపీకృష్ణ మరియు ప్రధాన కార్యదర్శి ఎన్. బి. ఉమాశంకర్‌బాబు సంతకం చేశారు.

సస్పెన్షన్ తర్వాత రాఘవ్‌కు ఎలాంటి సపోర్ట్ ఇవ్వబోమని SIFEA క్లియర్‌గా తెలిపింది. ఇండస్ట్రీలో ఉన్న ఇతర సంస్థలు కూడా యూనియన్ రూల్స్‌ను స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలని సూచించింది. అయితే, ఏప్రిల్ 2026 చివరి నాటికి, రాఘవ్‌ సస్పెన్షన్‌లో ఉన్నట్లు సమాచారం.

ప్రదీప్ రాఘవ్ సినిమాలు..

ఇండస్ట్రీలో మంచి క్రెడిబిలిటీ ఉన్న ఎడిటర్ ప్రదీప్ రాఘవ్. కెరీర్ మొదట్లో ‘నీవెవరో’, ‘కెప్టెన్’ వంటి చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేశారు. ఆ తర్వాత వచ్చిన ‘లవ్ టుడే’ సినిమాతో తమిళ సినిమా పరిశ్రమలో ఎడిటర్‌గా మంచి గుర్తింపు పొందారు. ఇక వరసగా యంగ్ హీరో ప్రదీప్ రంగనాధ్ తో ‘కోమలి’, ‘డ్రాగన్’, ‘లైక్’ లాంటి హిట్ ప్రాజెక్ట్స్‌కు వర్క్ చేసి సత్తా చాటుకున్నారు. ఇప్పుడు ఈ టాలెంటెడ్ ఎడిటర్..  వివాదంలోకి రావడం హాట్ టాపిక్‌గా మారింది.

‘జన నాయగన్’ గురించి..

మొదట జనవరి 9న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా, CBFC లీగల్ ఇష్యూస్ వల్ల వాయిదా పడింది. తర్వాత ఆన్‌లైన్ లీక్‌తో మరిన్ని సమస్యలు ఎదుర్కొంది. హెచ్. వినోత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో పూజా హెగ్డే, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మమిత బైజు కీలక పాత్రల్లో నటించారు. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించే ఛాన్స్ ఉంది.