V6 News

Kl Rahul: కేఎల్ రాహుల్ నయా రికార్డ్.. ఐపీఎల్ చరిత్రలో 150 రన్స్ చేసిన తొలి భారతీయుడు

Kl Rahul: కేఎల్ రాహుల్ నయా రికార్డ్.. ఐపీఎల్ చరిత్రలో 150 రన్స్ చేసిన తొలి భారతీయుడు

Kl Rahul: అరుణ్ జైట్లీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. కేవలం 67 బంతుల్లోనే 152 పరుగులు (నాటౌట్) చేసి, ఐపీఎల్ చరిత్రలో సరికొత్త మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో 150 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన మొదటి భారతీయ ఆటగాడిగా రాహుల్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో (6 సెంచరీలు) క్రిస్ గేల్ సరసన నిలిచాడు.

రికార్డుల వేట:
* తొలి భారతీయ వీరుడు:
ఐపీఎల్ చరిత్రలో 150 పరుగుల మైలురాయిని దాటిన మొట్టమొదటి భారతీయ బ్యాటర్‌గా రాహుల్ రికార్డు నెలకొల్పాడు.
* అభిషేక్ శర్మ రికార్డు బ్రేక్: గత ఏడాది పంజాబ్ కింగ్స్‌పైనే అభిషేక్ శర్మ చేసిన 141 పరుగుల రికార్డును రాహుల్ ఈరోజు (2026, ఏప్రిల్ 25న) అధిగమించాడు. విశేషమేమిటంటే, అంతకుముందు 132 పరుగులతో రాహుల్ పేరిట ఉన్న రికార్డును అభిషేక్ బ్రేక్ చేయగా, ఇప్పుడు రాహుల్ మళ్ళీ తన స్థానాన్ని దక్కించుకున్నాడు.
* దిగ్గజాల సరసన రాహుల్: ఐపీఎల్ చరిత్రలో 150+ పరుగులు చేసిన ముగ్గురు దిగ్గజాల జాబితాలో (క్రిస్ గేల్, బ్రెండన్ మెకల్లమ్ తర్వాత) రాహుల్ చేరాడు. 

ఢిల్లీ క్యాపిటల్స్ రికార్డ్: 
* గతంలో రిషబ్ పంత్ (128*) పేరిట ఉన్న ఢిల్లీ ఫ్రాంచైజీ అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును రాహుల్ అధిగమించాడు. 
* రెండో వికెట్‌కు రికార్డ్ భాగస్వామ్యం: నితీష్ రాణాతో కలిసి రెండో వికెట్‌కు 220 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన కేఎల్ రాహుల్

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు:
ప్రస్తుతం కేఎల్ రాహుల్ సాధించిన 152* పరుగులు ఐపీఎల్ చరిత్రలోనే మూడవ అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది. 
* మొదటి స్థానంలో ఉన్న క్రిస్ గేల్ 2013లో పుణే వారియర్స్ పై 175 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
* రెండో స్థానంలో ఉన్న  బ్రెండన్ మెకల్లమ్ 2008లో ఆర్‌సీబీపై 158 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 
* మూడో స్థానంలో నిలిచిన కేఎల్ రాహుల్ 2026లో పంజాబ్ కింగ్స్ పై 152 పరుగులతో నాటౌట్ గా అవతరించాడు. 
* ఆ తర్వాత అభిషేక్ శర్మ 141 పరుగులు, క్వింటన్ డి కాక్ 140 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.  

ఇక నితీష్ రాణాతో కలిసి పంజాబ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టిన కేఎల్ రాహుల్, తన ఐపీఎల్ కెరీర్‌లో 6వ సెంచరీని నమోదు చేశాడు. రాహుల్ విధ్వంసంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 264 పరుగుల భారీ స్కోరును సాధించింది. అయితే కేఎల్ రాహుల్ ఆడిన ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా పంజాబ్ జట్టుపైనే అతను ఈ ఘనత సాధించడం విశేషం.