కథ ఉంటే చాలు చిన్న సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తాయి. ఆ కోవలోకే వస్తుంది యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్ నటించిన లేటెస్ట్ చిత్రం 'రాకాస'. లేడీ డైరెక్టర్ మానస శర్మ అద్భుతమైన విజన్ తో తెరకెక్కించిన ఈ చిత్రం, ఏప్రిల్ 03న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఫాంటసీ హారర్ కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఒకవైపు నవ్విస్తూనే మరోవైపు భయపెట్టి క్లీన్ హిట్ గా నిలిచింది.
నిహారిక ఖాతాలో మరో సక్సెస్
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల, జీ స్టూడియోస్‌తో కలిసి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఒక నిర్మాతగా నిహారిక ఎంచుకున్న కథ, ప్రమోషన్ల కోసం ఆమె చేసిన హడావిడి ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా సంగీత్ శోభన్ తనదైన టైమింగ్‌తో ఆకట్టుకోగా, హీరోయిన్ నయన్ సారిక గ్లామర్‌తో పాటు నటనతోనూ మెప్పించింది.
కథానేపథ్యం..
రాకవనం గ్రామానికి చెందిన వీరబాబు అలియాస్ వీర (సంగీత్ శోభన్ ) ప్రేమ కోసం అమెరికా నుంచి వస్తాడు. కానీ అతను ప్రేమించిన సుకన్య మాత్రం మోసం చేసి మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. దీంతో వీర నిరాశలో పడతాడు. అదే సమయంలో సోము (వెన్నెల కిశోర్) హత్య కేసులో అతనిపై అనుమానం రావడంతో అతని పాస్‌పోర్ట్ ను పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. ఇదిలా ఉంటే, రాకవనం గ్రామంలో ఉన్న పాడుబడ్డ కోటలో రాక్షసుడికి నరబలి ఇచ్చే ఆనవాయితీ ఉంటుంది. చివరికి కొన్ని అనూహ్య పరిస్థితుల వల్ల వీరనే ఆ కోటలోకి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ అతడికి ఎదురయ్యే భయానక సంఘటనలు, సుబ్బలక్ష్మి (నయన్ సారిక ) ప్రవేశం, అలాగే చనిపోయాడని అనుకున్న సోము అక్కడ కనిపించడం కథకు ట్విస్ట్ ఇస్తాయి. ఇంతకీ ఆ రాకవనంలో రాక్షసుడి రహస్యం ఏమిటి? వీర, సుబ్బలక్ష్మి అక్కడి నుంచి బయటపడతారా? అన్నదే మిగతా కథ.
వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను, బ్రహ్మాజీల కామెడీ టైమింగ్ థియేటర్లలో నవ్వుల పూలు పూయించింది. తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, అన్నపూర్ణమ్మ, రోహిణి వంటి దిగ్గజ నటుల నటన ఈ సినిమాకు వెన్నెముకగా నిలిచింది. అనుదీప్ దేవ్ అందించిన నేపథ్య సంగీతం హారర్ సీన్లలో ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టించింది. ఈడురోలు రాజు సినిమాటోగ్రఫీ సినిమాకు గ్రాండ్ లుక్ తీసుకువచ్చింది.
ఓటీటీలో ఎప్పుడంటే?
థియేటర్లలో సక్సెస్ ఫుల్ రన్ ముగించుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ఎంట్రీకి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. మే 1 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా, ఇతర పాన్ ఇండియా భాషల్లోనూ రాకాస సందడి చేయనుందని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. థియేటర్లలో మిస్ అయిన వారు, మరోసారి ఇంట్లోనే కూర్చుని ఈ హారర్ కామెడీ థ్రిల్లర్‌ను ఎంజాయ్ చేయాలనుకునే వారికి మే డే కానుకగా రాకాస రాబోతోంది.

