కోర్ అర్బన్ రీజియన్‌ను హైదరాబాద్,
సైబరాబాద్, మల్కాజిగిరిగా విభజిస్తూ జీవో
మూడేసి జోన్లతో సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లు
6 జోన్లకే పరిమితమైన పాత జీహెచ్ఎంసీ
రెండు కొత్త కార్పొరేషన్లకు కమిషనర్ల నియామకం
గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్ కొనసాగింపు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించడంతో పాటు ఓ స్పెషలాఫీసర్, మరో ఇద్దరు కమిషనర్లను నియమిస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాత జీహెచ్ఎంసీలో ఆరు జోన్లు, మూడేసి జోన్లతో సైబరాబాద్, మల్కాజి గిరి మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ జీవో నంబర్ 55 రిలీజ్ చేసింది. హైదరాబాద్ మహానగరం చుట్టూరా 158 కి.మీ పరిధిలో ఉన్న ఔటర్‌రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపలి భూభాగాన్ని కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్)గా మారుస్తూ పాత జీహెచ్ఎంసీని పునర్విభజన చేసినట్టుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మూడు కార్పొరేషన్లకు వేర్వేరుగా పాలకవర్గాలు ఉంటాయని ఆ జీవోలో స్పష్టం చేశారు. మూడు కార్పొరేషన్లకు కలిపి స్పెషల్ఆఫీసర్గా 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సీనియర్ఆఫీసర్, ప్రభుత్వ స్పెషల్చీఫ్సెక్రటరీ జయేశ్‌రంజన్‌కు బాధ్యతలు అప్పగించారు. గ్రేటర్హైదరాబాద్ కమిషనర్‌గా ఉన్న 2012 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ఆర్వీ కర్ణన్‌ను కొనసాగిస్తూనే, కొత్తగా ఏర్పడిన సైబరాబాద్కమిషనర్గా 2013 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ జి.సృజన, మరో అడిషనల్కమిషనర్ టి.వినయ్‌కృష్ణారెడ్డిని నియమించారు.
అప్పుడు కలిపారు.. ఇప్పుడు విభజించారు!
2011 జనాభా లెక్కల ప్రకారం పాత జీహెచ్ఎంసీలో 68.10 లక్షల జనాభా ఉన్నది. 2020 డిసెంబర్లో పాలకవర్గాల ఎన్నికలు నిర్వహించే సమయానికి 150 డివిజన్లున్నాయి. ఓఆర్ఆర్ రాకతో కోర్అర్బన్ ఏరియా పెరగగా అభివృద్ధిని విస్తరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో ఔటర్‌రింగ్‌రోడ్డు లోపలున్న 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లను హైదరాబాద్ మెగా సిటీలో విలీనం చేస్తూ నవంబర్25న రాష్ట్ర కేబినెట్ఆమోదం తెలిపి డిసెంబర్లో జీవో జారీ చేసింది.
జనాభా పెరగడంతో ప్రస్తుతం మెగాసిటీలో నివసిస్తున్న ప్రజల సంఖ్య 1.40 కోట్లకు చేరింది. గతంలో 650 చదరపు కి.మీ విస్తీర్ణం ఉండే జీహెచ్ఎంసీ పరిధి 2,053 వేల చదరపు కి.మీకు పెరిగింది. దీంతో కొత్తగా ప్రజల అవసరాలు తీర్చడానికి, పరిపాలన సౌలభ్యం కోసం జోన్లు, సర్కిళ్లు, డివిజన్లను మార్చడానికి సర్కారు జీవో జారీచేసింది. సర్కారు ఆదేశాలతో ఆఫీసర్లు జీహెచ్ఎంసీని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 డివిజన్లతో దేశంలోనే అతి పెద్ద నగరపాలక సంస్థగా మార్చారు. కొత్తగా ఏర్పడిన జోన్లు, సర్కిళ్లు, డివిజన్ల వివరాల మ్యాప్‌లతో కూడిన జీవోను గతేడాది డిసెంబరు 3న రిలీజ్ చేసింది.
19 ఏండ్లలో మూడుసార్లు రూపాంతరం
19 ఏండ్లలో ఎంసీహెచ్ మూడు సార్లు రూపాంతరం చెందింది. 2007లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్.. శివారులోని 12 మున్సిపాల్టీల విలీనంతో జీహెచ్ఎంసీగా మారింది. 170 కిలోమీటర్ల నుంచి 650 చదరపు కిలోమీటర్లకు పరిధి పెంచుకుంది. గత నవంబర్ 25 వరకు ఇలాగే కొనసాగింది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) పరిధిలోని 27 పట్టణ, స్థానిక సంస్థలను విలీనం చేయడంతో 2,053 కిలోమీటర్లకు పెరిగింది.
6 జోన్లకే పరిమితమైన పాత జీహెచ్ఎంసీ
జీహెచ్ఎంసీని సుమారు 70 లక్షల జనాభాతో కూడిన ఆరు జోన్లకు పరిమితం చేశారు. సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లలో సగటున 35 లక్షల జనాభా ఉండేటట్లుగా మూడు జోన్ల చొప్పున విభజించారు. జీహెచ్ఎంసీలో శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, ఖైరతాబాద్, గోల్కొండ, సికింద్రాబాద్ జోన్లు, 30 సర్కిల్స్, 150 డివిజన్లు ఉంటాయి. ప్రస్తుతం 689 చదరపు కిలోమీటర్లకు జీహెచ్ఎంసీ పరిమితమైంది. కమిషనర్ గా ఆర్వీ కర్ణన్నే కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
సైబరాబాద్‌లో మూడు జోన్లు
సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లున్నాయి. ఇందులో 16 సర్కిల్స్, 76 డివిజన్లు ఉన్నాయి. 613 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పడింది. మొదటి కమిషనర్ గా జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్, ఐఏఎస్ ఆఫీసర్కె. సృజనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె 2013 బ్యాచ్‌కు చెందిన వారు.
గతంలో ఏపీలోని విశాఖపట్నం కమిషనర్‌గా, కర్నూలు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. తెలంగాణలో పంచాయతీరాజ్ డైరెక్టర్ గా ఉన్నారు. కరోనా టైంలో బాలింతగా ఉండి కూడా కేవలం 22 రోజులకే విధుల్లో చేరి ప్రశంసలు అందుకున్నారు. హెచ్ఐసీసీ న్యాక్ బిల్డింగ్ లో బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు.
మల్కాజిగిరిలోనూ మూడే
మల్కాజిగిరి కార్పొరేషన్ (ఎంఎంసీ)లో మల్కాజిగిరి, ఎల్బీనగర్, ఉప్పల్ జోన్లు ఉన్నాయి. ఇందులో కొత్తగా ఏర్పాటు చేసిన14 సర్కిల్స్, 74 డివిజన్లు ఉన్నాయి. ఈ కార్పొరేషన్ 654 చ.కి విస్తీర్ణంతో ఏర్పడింది. మొట్టమొదటి కమిషనర్ గా జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్, ఐఏఎస్ ఆఫీసర్2013 బ్యాచ్‌కు చెందిన టి. వినయ్ కృష్ణారెడ్డిని ప్రభుత్వం నియమించింది. వినయ్ కృష్ణారెడ్డికి నిజామాబాద్, నల్గొండ జిల్లాల కలెక్టర్ గా పనిచేసిన అనుభవం ఉంది. ఈయన కూడా బుధవారం తార్నాకలోని ఆఫీసులో బాధ్యతలు తీసుకున్నారు.
17 ఏండ్ల తర్వాత స్పెషల్ ఆఫీసర్ పాలన
గ్రేటర్ హైదరాబాద్‌లో 17 ఏండ్ల తర్వాత స్పెషల్ఆఫీసర్ పాలన వచ్చింది. ఈ మూడు కార్పొరేషన్లకు కలిపి స్పెషల్ ఆఫీసర్‌గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ జయేశ్ రంజన్ని ప్రభుత్వం నియమించింది. ఈయన కూడా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మేయర్, కార్పొరేటర్ల పదవీకాలం పూర్తికావడంతో పాలకవర్గం తీసుకునే నిర్ణయాలన్నింటిని ఈయనే తీసుకోనున్నారు. మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగే వరకు స్పెషల్ఆఫీసర్ పాలన కొనసాగనున్నది.
పాలకమండలి లేనప్పుడు.. మేయర్‌కు సమాన హోదాలో ప్రభుత్వం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్లను నియమించి పరిపాలన కొనసాగించడం పరిపాటి. చివరి సారిగా 2008 సెప్టెంబరు నుంచి 2009 డిసెంబరు వరకు ఎస్పీ సింగ్ స్పెషల్ ఆఫీసర్ హోదాలో జీహెచ్ఎంసీ బాధ్యతలు నిర్వర్తించారు. మళ్లీ ఇన్నేండ్ల తర్వాత ఇప్పుడు జయేశ్‌రంజన్ ఆ హోదాలో బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత ముగ్గరు కమిషనర్లు సీఎస్ రామకృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిశారు.
