
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో వచ్చిన బలగం సినిమాకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మార్చి 3న రిలీజై విజయం అందుకున్న ఈ మూవీని చాలా మంది సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు. లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి బలగం టీంను ప్రశంసించారు. ఈ మూవి డైరెక్టర్ జబర్దస్త్ కమోడియన్ వేణుని చిరంజీవి ప్రశంసించారు. శాలువ కప్పి సన్మానం చేశారు. చాలా బాగా తీసి తమకు షాకిచ్చావని వేణును పొగిడారు. సినిమా రియాల్టికి దగ్గరగా ఉందన్నారు. కమర్షియల్ ప్రొడ్యూసర్ అయినప్పటికీ సినిమాకు వేణు పూర్తి న్యాయం చేశాడని అన్నారు. వేణు గతంలో చేసిన జబర్దస్త్ స్కిట్ చూసి ఇంత టాలెంట్ ఉందా అని అనిపించిందన్నారు. మూవీ టీం, హీరో ప్రియదర్శి దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.
‘చిరు అన్నయ్య.. మీ సినిమాలు చూసి స్పూర్తి పొందిన నేను ఇవాళ మీ పక్కన నిలబడి ప్రశంసలు దక్కించుకున్నందుకు గర్వంగా సంతోషంగా ఉంది. ఏదో ఒక రోజు మీతో కలిసి పని చేస్తాననుకుంటున్న.’ అని బలగం హీరో ప్రియదర్శి ట్వీట్ చేశారు.
చిరంజీవి ప్రశంసలకు బలగం టీం కూడా రిప్లై ఇచ్చింది. ఇది తమకు మెగా ప్రశంస అంటూ ట్వీట్ చేసింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్ నటించారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు.