బీజేపీకి మేఘా విరాళం 584 కోట్లు

బీజేపీకి మేఘా విరాళం 584 కోట్లు
  •     బీఆర్ఎస్ కు 195 కోట్లు, డీఎంకేకు 85 కోట్లు డొనేట్
  •     ఎలక్టోరల్ బాండ్ల డేటాలో వెల్లడి  

న్యూఢిల్లీ: హైదరాబాద్ కు చెందిన మేఘా ఇంజనీరింగ్ కంపెనీ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి రూ.584 కోట్లు విరాళం ఇచ్చింది. ఆ పార్టీకి అత్యధికంగా డొనేట్ చేసిన కంపెనీ ఇదేనని ఎలక్టోరల్ బాండ్ల డేటాలో వెల్లడైంది. తన అనుబంధ కంపెనీ వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్ మిషన్ ద్వారా మరో రూ.80 కోట్లు కూడా బీజేపీకి మేఘా డొనేట్ చేసింది. 

మేఘా కంపెనీ మొత్తం రూ.966 కోట్ల బాండ్లను కొనుగోలు చేయగా, అందులో 60%  బీజేపీకే ఇచ్చింది. అలాగే బీఆర్ఎస్ పార్టీకి రూ.195 కోట్లు, డీఎంకేకు రూ.85 కోట్లు డొనేట్ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) గురువారం ఎలక్టోరల్ బాండ్ల పూర్తి వివరాలను సీరియల్ నంబర్లతో సహా ఎలక్షన్ కమిషన్(ఈసీ)కు ఇచ్చింది. ఎస్ బీఐ అందజేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీ తన వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసింది. దీంతో ఏ కంపెనీ, ఏ పార్టీకి ఎంత విరాళం ఇచ్చిందనే విషయం బయటకు వచ్చింది. దేశంలోని టాప్ 18 కంపెనీలు బీజేపీకి డొనేషన్ ఇచ్చినట్టు తేలింది. 

లిస్టులో రిలయన్స్ కంపెనీలు? 

లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ కు చెందిన ‘ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్’ కంపెనీ దేశంలోనే అత్యధికంగా రూ.1,368 కోట్ల విలువైన  బాండ్లను కొన్నది. ఇందులో టీఎంసీకి రూ.542 కోట్లు, డీఎంకేకు రూ.503 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఆ తర్వాత వైఎస్సార్సీపీకి రూ.154 కోట్లు, బీజేపీకి రూ.100 కోట్లు డొనేట్ చేసింది. రిలయన్స్ గ్రూపునకు చెందిన కంపెనీగా ప్రచారమవుతున్న క్విక్ సప్లై చెయిన్ రూ.420 కోట్ల  బాండ్లను కొనుగోలు చేసింది. 

ఇందులో రూ.395 కోట్లు బీజేపీకి, రూ.25 కోట్లు శివసేనకు ఇచ్చింది. ఇక రిలయన్స్ గ్రూపులోనిదని చెప్తున్న మరో కంపెనీ హనీవెల్ ప్రాపర్టీస్ రూ.30 కోట్లను బీజేపీకి డొనేట్ చేసింది. కాగా, కెవెంటర్ ఫుడ్ పార్క్ ఇన్ ఫ్రా, ఎంకేజే ఎంటర్ ప్రైజెస్, మదన్ లాల్ లిమిటెడ్ కలిసి రూ.573 కోట్ల బాండ్లను కొనుగోలు చేశాయి. ఇందులో రూ.346 కోట్లను బీజేపీకి, రూ.121 కోట్లను కాంగ్రెస్ కు విరాళంగా ఇచ్చాయి.

ఫ్యూచర్ గేమింగ్ విరాళాలు రూ.1,368 కోట్లు 

లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ కు చెందిన ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ కంపెనీ దేశంలోనే అత్యధికంగా రూ.1,368 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. ఆ తర్వాత రూ.966 కోట్లతో హైదరాబాద్ కు చెందిన మేఘా కంపెనీ రెండో స్థానంలో ఉంది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందినదిగా చెప్తున్న క్విక్ సప్లై చెయిన్ కంపెనీ రూ.420 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది.