రాజభవనంలో బందీలుగా ఉండలేక..

రాజభవనంలో బందీలుగా ఉండలేక..
  • డిప్రెషన్ తో  సూసైడ్ చేసుకోవాలనుకున్నా. 
  •   నా బిడ్డ నల్లగా పుడితే ప్రిన్స్ గాప్రకటించనన్నారు. 
  •   మాకు సెక్యూరిటీ ఇవ్వనన్నారు.
  •   పెళ్లి డ్రస్ విషయంలో తోటి కోడలు నన్ను అవమానించింది. 
  •   మా మీద అబద్ధపు ప్రచారాలు చేశారు. - మెగన్

పెళ్లై మెట్టినింటికి వెళ్లిన ఆడపిల్ల అక్కడ అడ్జస్ట్ అవడానికి కాస్త టైం పడుతుంది.దాంతో ఒక్కోసారి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరితో ఎలా మాట్లాడాలి? అక్కడి పరిస్థితులకు ఎలా అలవాటు పడాలి? అనే విషయం అర్థం కాదు. అది సామాన్యుల ఇల్లయినా, రాజకుటుంబమైనా. ఎక్కడో ఒకచోట, ఏదో ఒక రూపంలో వివక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రిన్స్ హ్యారీని పెండ్లి చేసుకుని బ్రిటన్ రాజకుటుంబంలోకి అడుగుపెట్టిన మెగన్ మార్కెల్ కూడా ఈ వివక్షను ఎదుర్కొంది. బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ నుంచి వేరు పడిందీ జంట. రాచరిక చాదస్తాల మధ్య ఎలా ఉన్నారో  ఓప్రా విన్ఫ్రేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.  
స్వేచ్ఛగా ఎగిరే పక్షిని బంగారు పంజరంలో పెట్టినా దానికి ఆనందం ఉండదు. రాజకుటుంబంలో ఉన్నన్ని రోజులు మెగన్ మార్కెల్ జీవితం కూడా అలానే ఉంది. బ్రిటన్ రాజకుటుంబంలో అడుగుపెట్టాక తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెప్పిందామె. ఒకానొక టైంలో సూసైడ్ చేసుకుందామని కూడా అనుకుందట. మానసికంగా ఎంత బాధను అనుభవించిందో అర్థమవుతుంది. “నేను ఒకానొక టైంలో విపరీతమైన డిప్రెషన్లో ఉన్నాను. అప్పుడు నాకు ఎవరూ సాయం చేయలేదు. నా రంగు గురించి చాలా ఎక్కువగా మాట్లాడేవారు రాజకుటుంబంలో. నన్ను ఏడిపించేవారు. ఇవన్నీ చేస్తూ నన్ను ఇబ్బంది పెట్టడమే కాకుండా నా మీదే మీడియాకు అబద్ధాలు చెప్పేవారు” అని రాజకుటుంబం నుంచి బయటకు వచ్చేశాక ఇచ్చిన ఈ మొదటి ఇంటర్వ్యూలో చెప్పారు మెగన్ దంపతులు. ఈ ఇంటర్వ్యూలో లోకానికి తెలియని ఎన్నో విషయాలు మాట్లాడారు. రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ అమెరికాకు చెందిన నటి మెగన్ మార్కెల్ను 2018లో పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఇంట్లో కలిసి ఉండలేని పరిస్థితులు ఎదురవ్వడంతో 2020లో వాళ్లిద్దరూ కొడుకు ఆర్చీని తీసుకుని బయటికి వచ్చేశారు. 

అక్కడ రక్షణ లేదనిపించింది

“నేను మరీ అంత తెల్లగా ఉండను కదా!. కాబట్టి, నాకు పుట్టబోయే బిడ్డ కూడా అలానే ఉంటుందని రాజకుటుంబంలోని వాళ్లు మాట్లాడుకునేవాళ్లు. ఆ మాటలు నన్ను చాలా బాధపెట్టేవి. నా బిడ్డ గురించి అలా మాట్లాడడం నా మనసును కలచి వేసేది. మాటలు అనడమే కాకుండా నాకు పుట్టే బిడ్డ నలుపు రంగుతో పుడితే నాకు, బిడ్డకు సెక్యూరిటీ ఇవ్వబోమని హ్యారీతో చెప్పారు. అంతేకాదు ప్రిన్స్, ప్రిన్సెస్ హోదా కూడా ఇవ్వమని తేల్చి చెప్పారు. ఆర్చీ నా కడుపులో ఉన్నప్పుడు జరుగుతున్న ఇవన్నీ చూసి చాలాసార్లు చచ్చిపోవాలనిపించింది. 
నిజానికి పెళ్లైన తర్వాత రాజకుటుంబంలో ఎలా ఉండాలి? ఏం చేయాలి? అనే విషయాలు నాకు అస్సలు తెలియదు. క్వీన్ ముందు ఎలా ఉండాలనే విషయం తెలియక చాలా ఇబ్బందులు పడ్డాను. ఒక్కోసారి అసలు గది నుంచి బయటికి వచ్చేదాన్నే కాదు. ఫ్రెండ్స్ను కలిసేందుకు వెళ్లాలన్నా కూడా రిస్ట్రిక్షన్స్ ఉండేవి. దాంతో నెలల తరబడి బయటికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చునేదాన్ని. నేను పెరిగిన వాతావరణానికి, ఉంటున్న పరిస్థితులకు మధ్య చాలా తేడా ఉండేది. దాంతో నాకు ఊపిరాడనట్టు అనిపించేది. నా పరిస్థితిని, ఆలోచనల్ని ఎవరితో చెప్పుకోలేక... వాటి నుంచి బయటపడలేక... అప్పుడు నేను పడిన మానసికక్షోభ నన్ను డిప్రెషన్లో పడేసింది. నాకిక చావే శరణ్యం అనిపించింది. చుట్టూ కోటగోడలు, రక్షణ వ్యవస్థ ఉన్న రాజకుటుంబంలో ఉన్నా కూడా నాకు రక్షణ లేదని అప్పుడు అనిపించింది. అంతెందుకు అక్కడ అడుగుపెట్టకముందు... నా పెండ్లి టైంలో కూడా తోటికోడలు కేట్స్ నాతో గొడవపడింది. పెళ్లి గౌను విషయంలో ఏవేవో మాటలు అన్నది. అప్పుడు చాలా ఏడ్చాను. ఆ తర్వాత ఆ విషయంలో ఆమె నాకు ‘సారీ’  చెప్పింది. కానీ ఆమె ఏడ్చేలా చేసింది నేనే అని ప్రచారం చేశారు.  రాజకుటుంబంలోకి అడుగుపెట్టిన వెంటనే నా స్వేచ్ఛను కోల్పోయాను. డ్రైవింగ్ లైసెన్స్, కారు కీ, పాస్పోర్ట్ అన్నీ తీసుకున్నారు. మేం బయటికి వచ్చేసిన తర్వాతే అవన్నీ మాకు తిరిగి ఇచ్చారు. అక్కడ నేను ఉన్న రోజులన్నీ చీకటి రోజులే. లోపల అంత బాధపెట్టుకుని బయటికి నవ్వుతూ కనిపించాలంటే చాలా కష్టం. ఇంత బాధలోనూ నాకు ఉన్న ఓదార్పు హ్యారీ. నేను బాధపడిన ప్రతిసారి తను నా కన్నీళ్లు తుడిచి సపోర్ట్గా ఉండేవాడు. కొండంత ధైర్యాన్ని ఇచ్చేవాడు” అంటూ మెగన్ కన్నీళ్లు పెట్టుకుంది.  

ఇప్పుడే స్వేచ్ఛగా తిరుగుతున్నా

‘‘రాజకుటుంబం నుంచి విడిపోయిన తర్వాత మాకు డబ్బులు అందటం లేదు. మా అమ్మ ప్రిన్సెస్ డయానా నా కోసం ఉంచిన డబ్బుతోనే నేను నిలబడగలిగాను. నన్ను నమ్ముకుని నా కోసం వచ్చిన భార్య, నా కొడుకును తీసుకుని రాజకుటుంబం నుంచి బయటికి వచ్చాను. నన్ను అక్కడివాళ్లంతా ట్రాప్ చేశారు. కానీ, నాకు ఆ విషయం అర్థం కాలేదు. చాలాసార్లు బయటికి వచ్చేయాలి అనుకున్నాను. మెగన్ను వదిలి రాలేక పోయాను. మా నాన్నను, అన్నకు కూడా ట్రాప్ చేశారు. అక్కడే ఉంటే అమ్మ(డయానా)కు పట్టిన గతే పడుతుందని అర్థమైంది. మేం బయటికి వచ్చాక మా నాన్న నాతో మాట్లాడటం మానేశాడు. మాపై చాలా రూమర్స్ క్రియేట్ చేశారు. మీడియాలో చాలా తప్పుగా రాయించారు. నాన్నమ్మతో మంచి రిలేషన్ ఉండేది, కానీ, ఆమెను గుడ్డిగా నమ్మేవాడ్ని కాదు. కుటుంబం నుంచి బయటికి వచ్చాక మా జీవితంలో జరిగిన మార్పులు చాలా ముఖ్యమైనవి. నేనిప్పుడు హ్యాపీగా ఉన్నాను. మా అబ్బాయి ఆర్చీతో చాలా టైం గడుపుతున్నాను. వాడ్ని తీసుకుని ఎన్నోచోట్లకు వెళ్తున్నాను. బైక్రైడ్స్కు వెళ్లాను. నా చిన్నతనంలో నేను ఎప్పుడూ ఇలాంటివేవీ ఎంజాయ్ చేయలేదు. వీటన్నింటితో పాటు ఇప్పుడు నా కొడుకుతో కలిసి స్వేచ్ఛగా  బీచ్ లకు కూడా వెళ్లొచ్చు” అన్నాడు ప్రిన్స్ హ్యారీ.

‘‘క్వీన్ ఎలిజబెత్ - 2, రాయల్ ఫ్యామిలీలోకి నాకు వెల్కమ్ చెప్పారు. ఆమెతో మేం బాగా ఉండేవాళ్లం. ఈ మధ్యకాలంలో కూడా  చాలాసార్లు మాట్లాడా. పోయిన నెల ప్రిన్స్ ఫిలిప్ హాస్పిటల్లో చేరినప్పుడు కూడా ఆయన బాగోగులు అడిగి తెలుసుకున్నాను.” అన్నది మెగన్.