వేడి ముంచేయడానికి రెడీగా ఉంది. మనిషి బతుకుకు చేటు చేసేందుకు సిద్ధంగా ఉంది. మంచు ఖండాలను కరిగించి సంద్రాలను అల్లకల్లోలం చేసేస్తది. ప్రపంచవ్యాప్తంగా సముద్రాల మట్టాలు పెరుగుతాయి. వాటిలోని జీవజాతులు వేరే చోటుకు తరలిపోతాయి. హిమాలయాలు సహా ప్రపంచంలోని గ్లేసియర్లు 80 శాతం ఐస్‌ను కోల్పోతాయి. ఈ మాటలు చెబుతున్నది ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్‌గవర్నమెంటల్ పానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ). సముద్రాలపై వాతావరణ మార్పుల ప్రభావం ఎంత మేర ఉందో దాదాపు ఏడాది పాటు స్టడీ చేసిన ఐపీసీసీ, బుధవారం రిపోర్టును విడుదల చేసింది. అంతకుముందు సగటు టెంపరేచర్లు 1.5 డిగ్రీలు పెరిగితే భూమిపై పడే ప్రభావాన్ని అంచనా వేసిన సైంటిస్టులు ఇప్పుడు, సముద్రాలపై ఆ స్టడీ చేశారు. 36 దేశాలకు చెందిన 100 మందికిపైగా సైంటిస్టులు ఈ స్టడీలో పాల్గొన్నారు. ఆ రిపోర్టులోని వివరాలివి.
వేడికి కరుగుతున్నయ్
ఇప్పటికే భూగోళం మొత్తం బాగా వేడెక్కింది. దాన్ని అదుపు చేయడానికి సైంటిస్టులు, వివిధ దేశాలు ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తున్నారు. కానీ, ఆ వేడి ఇప్పుడు మంచు ఖండాలకు కొరకరాని కొయ్యగా మారింది. ఎప్పుడూ లేనంత వేగంగా ఐస్ కరిగిపోతోంది. దాని ప్రభావం భూమిపై బతుకుతున్న ప్రతి దానిపైనా పడబోతోంది. 1970 తర్వాత ఎప్పుడూ లేనంతగా బ్రేక్ లేకుండా భూమి వేడెక్కుతూనే ఉంది. మనం చేస్తున్న పనులకు భూమిపై ఉన్న నీళ్లలోకి ఆ వేడిలో 90 శాతం వెళ్లిపోతోంది. 1993 నుంచి నీళ్లు వేడిని శోషించుకోవడం రెట్టింపైంది. దాని ప్రభావం వల్లే సముద్రాలు పెరిగిపోతున్నాయి. కానీ, ఇప్పుడు మాత్రం ప్రత్యేకంగా గ్రీన్‌ల్యాండ్, అంటార్కిటికాలోని ఐస్ షీట్లు కరిగిపోవడం వల్ల సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి. 2007 నుంచి 2016 వరకు కరిగిన ఐస్, అంతకుముందు కరిగిన ఐస్‌తో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువైంది. అదే టైంలో గ్రీన్‌ల్యాండ్ ఐస్ కరగడం రెట్టింపైంది. 275 గిగాటన్నుల ఐస్ ఆ పదేళ్లలో కరిగిపోయింది. అంటే 27 వేల 500 కోట్ల టన్నుల ఐస్ నీరుగారిపోయింది. ఆ ఒక్క గ్రీన్‌ల్యాండ్ మొత్తం కరిగిపోతే 20 అడుగుల మేర సముద్రాలు పెరిగిపోతాయి. ఉష్ణమండలంలో ఉన్న యాండీస్, సెంట్రల్ యూరప్, ఉత్తర ఆసియా వంటి ప్రాంతాల్లోని గ్లేసియర్లు 2100 నాటికి 80 శాతం మంచును కోల్పోతాయి. దాని వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మందిపై పెను ప్రభావం పడుతుంది.
తీర ప్రాంతాలు మునిగిపోతాయ్
సముద్రాలు పెరిగితే ప్రపంచంలోని చాలా ప్రాంతాలు మునిగిపోక తప్పదని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అంటార్కిటికాలో ఎక్కువగా ఐస్ కరిగిపోతోంది. అంతకుముందు ఐపీసీసీ ఇచ్చిన రిపోర్టులో 10 సెంటీమీటర్లు మాత్రమే సముద్రాలు పెరుగుతాయని చెప్పినా, ఇప్పుడు మాత్రం 1.1 మీటర్లు (మూడున్నర అడుగులు) పెరుగుతుందని ఐపీసీసీ రిపోర్టు చెబుతోంది. దీని ప్రభావం తీర ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటుంది. దాదాపు 70 కోట్ల మంది బతుకుపై కొడుతుంది. 2100 తర్వాత ఆయా తీర ప్రాంతాలు బతకడానికి కూడా పనికిరాకుండా పోతాయి. అక్కడి జనాన్ని తరలించడమూ పెద్ద సమస్యగా మారుతుంది. వాళ్ల జీవనాధారం పోతుంది. డబ్బున్న న్యూయార్క్, షాంఘై, మెకాంగ్ వంటి డెల్టాలూ కనిపించకుండా పోతాయి. అంతేకాదు, నీళ్లు వేడెక్కడం వల్ల తుఫాన్ల తీవ్రత పెరుగుతుంది. 2050 నాటికి చాలా ప్రాంతాల్లో వేడి నీళ్లతో సముద్ర మట్టాలు పెరుగుతాయి. దాని వల్ల ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో తుఫాన్లు విరుచుకుపడి వరదలు ముంచెత్తుతాయి. సముద్రాల్లో బతికే వివిధ రకాల జీవులు, చేపల జాతులు వేరే ప్రాంతాలకు వెళ్లిపోతాయి.
ఆయా ప్రాంతాల్లో వాటి మీదే, వాటినే ఆహారంగా తీసుకునే వారికి నష్టం జరుగుతుంది. గ్లేసియర్లు, మంచు ఖండాలు కరిగిపోవడం వల్ల నీటి ఎద్దడి ఏర్పడి హైడల్ పవర్ ప్రాజెక్టులకు నీరు దొరకదు. కరెంట్ తయారు కాదు.
పెర్మాఫ్రాస్ట్లూ శాశ్వతం కాదు
పెర్మాఫ్రాస్ట్లు.. ఎప్పుడూ మంచుగడ్డలతో నిండి ఉండే ప్రాంతాలు. కానీ, వాటి ఉనికికీ ఇప్పుడు ముప్పు పొంచి ఉంది. ఎన్నో ఏళ్లుగా విడుదలవతున్న కార్బన్ ఉద్గారాలను అవి తమలో దాచుకున్నాయి. వాటి వల్ల సైబీరియా, ఉత్తర కెనడాల్లోని పెర్మాఫ్రాస్ట్లు 70 శాతం మేర కరిగిపోయే ముప్పు పొంచి ఉంది. దాని వల్ల మనం ఊహించని ఇంకో పెద్ద ప్రమాదమూ ముంచుకు రాబోతోంది. ఇన్ని నాళ్లు అవి దాచుకున్న కార్బన్ డయాక్సైడ్ను అవి గాల్లోకి విడుదల చేస్తాయి. దాని వల్ల టెంపరేచర్లు మరింత పెరుగుతాయి. అంటార్కిటికాలో పరిస్థితి ఇప్పటికే చేయిదాటిపోయింది. ఎవరూ రిపేర్ చేయలేనంతగా ఐస్ కరిగిపోతోంది. దాని వల్ల సముద్రాలు పెరగడం ఖాయమంటున్నారు సైంటిస్టులు. మనం ఇప్పుడు కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించినా భవిష్యత్తులో మాత్రం సముద్రాలు కచ్చితంగా పెరుగుతాయంటున్నారు.
పరిష్కారం లేదా?
అయినా పరిష్కారం మన చేతుల్లోనే ఉందంటోంది రిపోర్ట్. సముద్ర మట్టాలు మరీ పెరగకుండా అడ్డుకునే శక్తి మనకే ఉంది. 2030 నాటికి కార్బన్ ఎమిషన్స్‌ను 45 శాతానికి తగ్గించుకోగలగాలి. అప్పటికీ వాతావరణం మనకు సవాల్ విసిరే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. కానీ, ఆ సవాళ్లను మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఎమిషన్స్‌ను తగ్గించేలా వివిధ దేశాల రాజకీయ నేతలపై ప్రజలు ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే గ్రెటా థన్‌బర్గ్, రిధిమా పాండే వంటి టీనేజర్లు పోరును ముమ్మరం చేశారు.

