ప్రజా రవాణా విస్తరణపై ప్రభుత్వం దృష్టి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రజా రవాణా విస్తరణపై ప్రభుత్వం దృష్టి  :  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  •     మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  •     ఎల్ పీజీ గ్యాస్ సరఫరా పెంపునకు కేంద్ర మంత్రికి లెటర్​
  •     ఎల్పీజీ  ​కొరత నివారణకు చర్యలు తీసుకుంటామని హామీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆటోగ్యాస్ (ఎల్‌‌పీజీ) కొరత నేపథ్యంలో ప్రజా రవాణా సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి వెల్లడించారు. గ్యాస్ ఆధారిత వాహనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఫోకస్ పెట్టిందని తెలిపారు. సోమవారం సచివాలయంలో సివిల్​సప్లయ్స్​అధికారులు, ఎల్‌‌పీజీ పంపిణీ సంస్థల ప్రతినిధులతో మంత్రి అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ సంస్థలతో ఏర్పడిన సరఫరా లోటును పూడ్చేందుకు ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకురావాలని కోరారు. 

ఆటో ఎల్‌‌పీజీ గ్యాస్ సరఫరాలో ప్రస్తుతం 75 శాతం వాటా ప్రైవేట్ సంస్థలదే కాగా, ప్రభుత్వ సంస్థల వాటా 25–30 శాతం మాత్రమే ఉందని వివరించారు. ప్రస్తుతం రోజువారీగా 202 టన్నుల గ్యాస్ అవసరం ఉండగా, కేవలం 147  టన్నులే అందుబాటులో ఉందని, దీంతో లోటు సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఈ లోటు ప్రైవేట్ రంగంలోనే కనిపిస్తుందన్నారు. ఐఓసీఎల్ సంస్థ మాత్రమే రోజుకు 35  టన్నుల గ్యాస్‌‌ను 23 ఔట్‌‌ లెట్ల ద్వారా సరఫరా చేస్తోందని వెల్లడించారు. 

హైదరాబాద్ నగరంలో మొత్తం 143 గ్యాస్ ఔట్‌‌లెట్లు ఉండగా, అందులో 23 పనిచేయడం లేదని, వాటిలో 17 నగర కేంద్ర ప్రాంతాల్లోనే ఉన్నాయని వివరించారు. దీంతో కొరత తీవ్ర పెరిగిందన్నారు. ఎల్‌‌పీజీ దిగుమతుల్లో నౌకల రాక ఆలస్యం కావడం ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని స్పష్టం చేశారు. అంతర్జాతీయ యుద్ధం కారణంగా ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందన్నారు. 

ఈ నేపథ్యంలో గ్యాస్ సరఫరా పెంచాలని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్​ సింగ్​పూరికి లెటర్ రాయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గ్యాస్ ఆధారిత ఆటో సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుత పరిస్థితిని వివరించాలని సూచించారు. కొరత నివారణకు తక్షణ, దీర్ఘకాలిక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, హైదరాబాద్ కలెక్టర్ హరిచందనతోపాటు ఐఓసీఎల్, హెచ్‌‌పీసీఎల్, గోగ్యాస్, టోటల్ ఎనర్జీ, సూపర్ గ్యాస్, ప్రైమ్ గ్యాస్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.