గద్దర్ స్పెషల్ జ్యూరీ అవార్డు గెలుపొందిన ‘23’ మూవీ టీమ్‌కు జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా ప్రత్యేక అభినందనలు తెలిపారు. నేరస్థుల పరివర్తన, నేరాలను తగ్గించాలనే కథాంశంతో రాజ్ రాచకొండ రూపొందించిన ఈ చిత్రం గతేడాది విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
రీసెంట్‌గా గద్దర్ స్పెషల్ జ్యూరీ అవార్డును కూడా అందుకోవడంతో టీమ్‌ను అభినందిస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సౌమ్య మిశ్రా మాట్లాడుతూ ‘ఈ సినిమా నిర్మాణం అత్యంత బాధ్యతతో, కష్టంతో కూడుకున్నది. ఈ ప్రయత్నం చేసిన టీంని అభినందిస్తున్నా. నేరస్థుల పరివర్తన అనే అంశాలు కథలో బాగా పొందుపరిచారు.
జైలు జీవితాలను ఇంత వాస్తవికంగా తెరమీద ఇప్పటివరకూ చూపలేదు. ది షాషాంక్ రిడెంప్షన్ వంటి గొప్ప చిత్రాల సరసన నిలబడే చిత్రమిది. కచ్చితంగా ఖైదీలకు ప్రదర్శించేందుకు ఏర్పాటు చేస్తాం. కొందరిలో మార్పు వచ్చినా అది ఈ సినిమా సాధించిన గొప్ప విజయం’ అని అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ దర్శకులు బి.నర్సింగరావు మాట్లాడుతూ ‘ఇలాంటి సినిమాలకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలి. నేను రూపొందించిన మాభూమి, దాసి వంటి వాస్తవికత దృక్పధం ఉన్న సినిమాలు తర్వాత ఆ పరంపర కొనసాగలేదు. ఇప్పుడు ‘23’ లాంటి సినిమాలు వస్తున్నందుకు ఆనందంగా ఉంది’ అని అన్నారు. ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ దర్శకుడు రాజ్ థ్యాంక్స్ చెప్పాడు. డా. బీనా, సిద్దోజి, రచయిత భరద్వాజ పాల్గొన్నారు.
