హనుమకొండ, వెలుగు: అవుటేజ్ మేనేజ్మెంట్ సిస్టంతో విద్యుత్ అంతరాయాలకు చెక్ పెట్టవచ్చని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. స్కాడా కంట్రోల్ రూం నుంచి అవుటేజ్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా సబ్ స్టేషన్లు, లైన్లు, ట్రాన్స్ ఫార్మర్ల అంతరాయాల లొకేషన్ తెలుసుకోవడంతో పాటు వేగంగా రిపేర్ చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు.
హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్ లో సంస్థ పరిధిలోని 17 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలతో సోమవారం ఆయన రివ్యూ చేశారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ పొడవాటి లైన్లు, అడవుల్లో కవర్డ్ కండక్టర్స్ వల్ల చెట్ల కొమ్మలు విరిగినా ఎలాంటి అంతరాయాలు ఏర్పడవన్నారు. జీఐఎస్ మ్యాప్పింగ్ ద్వారా ఫీడర్ల డిజిటలైజేషన్ జరిగి విద్యుత్ సమస్యలను సులువుగా గుర్తించవచ్చన్నారు.
రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సబ్ స్టేషన్ పనులు వేగవంతం చేయాలన్నారు. ఫాల్ట్ ప్యాసేజీ ఇండికేటర్లు ఇప్పటివరకు 2800 ఏర్పాటు చేశారని, పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. క్లాడ్ ఏఐ సిస్టం ద్వారా డేటాను విశ్లేషించుకుని, పనిని సులువుగా చేయవచ్చన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు పెద్ద పీట వేస్తున్నామని, ఎల్సీ యాప్, పని ప్రదేశాల్లో భద్రత పరికరాలు వాడేలా ప్రతిరోజు పెప్ టాక్ నిర్వహిస్తున్నామని వివరించారు. సమావేశంలో డైరెక్టర్లు వి.మోహన్ రావు, టి.మధుసూదన్, సీఈలు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న సీఎండీ వరుణ్ రెడ్డి
