
ఫుట్బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సి రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా..? అతనికి ఫిఫా వరల్డ్ కప్ 2022 చివరిది కానుందా..? మెస్సి ఫుట్బాల్ కెరీర్లో మరో 90 నిమిషాల ఆటే మిగిలుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అద్భుతమైన ఆటతీరుతో అర్జెంటీనాను ఫైనల్ చేర్చిన మెస్సి..ఫైనల్ తర్వాత ఆటకు గుడ్ బై చెప్పే అవకాశాలున్నాయి. అయితే ఫిఫా వరల్డ్ కప్ను సగర్వంగా ముద్దాడి అంతర్జాతీయ ఫుట్బాల్కు పుల్ స్టాప్ పెట్టాలని మెస్సి యోచిస్తున్నాడు.
అర్జెంటీనా అదుర్స్..
ఫిఫా ప్రపంచ కప్-2022లో భాగంగా సెమీస్లో క్రొయేషియాపై3-0తో అర్జెంటీనా విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. 2014 తర్వాత మరోసారి ఫైనల్ చేరింది. 34వ నిమిషంలో మెస్సి తొలి గోల్ కొట్టగా...ఆ తర్వాత 39వ నిమిషంలో..69వ నిమిషంలో అల్వారెజ్ గోల్స్ సాధించాడు. దీంతో అర్జెంటీనా 3-0తో మ్యాచ్ను సొంతం చేసుకుని ఫైనల్కు చేరుకుంది.
వచ్చే వరల్డ్ కప్ ఆడతానో లేదో..
అర్జెంటీనాను ఫైనల్ చేర్చిన అనంతరం..మెస్సి తన రిటైర్మెంట్పై స్పష్టత ఇచ్చాడు. ఈ వరల్డ్ కప్పే అర్జెంటీనా తరపున ఆడే చివరి ప్రపంచకప్ అని స్పష్టం చేశాడు. ఫిఫా ఫైనల్ చేరడం సంతోషంగా ఉందని తెలిపాడు. ఫైనల్ ఆడటం ద్వారా ఫుట్బాల్ వరల్డ్ కప్ ప్రయాణానికి వీడ్కోలు పలుకుతానని చెప్పాడు. ఇంకో వరల్డ్ కప్ ఆడాలంటే మరో నాలుగేళ్లు వేచి చూడాలని..అంత వరకు తనలో ఆడే సామర్థ్యం ఉంటుందని అనుకోవడం లేదన్నాడు. ఈ వరల్డ్ కప్ తోనే వీడ్కోలు పలకడం మంచిదని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
కోచ్ ఏమన్నాడంటే..
మెస్సి రిటైర్మెంట్పై కోచ్ లియోనల్ స్కాలనీ స్పందించాడు. ఫిఫా వరల్డ్ కప్లో మెస్సి అద్భుతంగా ఆడుతున్నాడని కొనియాడాడు. ప్రస్తుతం అతని ఆటను ఆస్వాదిస్తున్నానని చెప్పాడు. వరల్డ్ కప్ తర్వాత మెస్సి ఆటను కొనసాగిస్తాడో లేదో చూడాలన్నాడు. అర్జెంటీనా తరపున మెస్సి ఆడటం జట్టుకు, ఫుట్బాల్ ప్రపంచానికి గొప్ప విషయమని తెలిపాడు.
మెస్సి కల నెరవేరేనా..?
ప్రస్తుతం ఫుట్బాల్ తరంలో అర్జెంటీనా ప్లేయర్ మెస్సి, పోర్చుగల్ స్టార్ రొనాల్డో దిగ్గజాలుగా పేరొందారు. అయితే ఈ వరల్డ్ కప్ను సాధించి ఆటకు వీడ్కోలు పలుకుదామని ఇద్దరు ఆశతో టోర్నీలో అడుగుపెట్టారు. ఇందులో 37 ఏళ్ల రొనాల్డో..తమ జట్టు క్వార్టర్లో వెనుదిరగడంతో కన్నీటి పర్యంతమైన వెనుదిరిగాడు. ఇక ఫిఫా వరల్డ్ కప్ ఆడటం కష్టమే అని సంకేతాలిచ్చాడు. ఇక మెస్సి తన జట్టును ఫైనల్ చేర్చి కలకు అడుగుదూరంలో నిలిచాడు. ఫైనల్లో అర్జెంటీనాను విజేతగా నిలిపి తన కలను నెరవేర్చుకోవాలని మెస్సి చూస్తున్నాడు. ప్రస్తుతం మెస్సీకి 35 ఏళ్లు. దీంతో అతను మరో ప్రపంచకప్ ఆడే సమయానికి 40ఏళ్లకు చేరుకుంటాడు. ఫిట్‌నెస్ ప్రాధాన్యంగా సాగే సాకర్‌లో అప్పటి వరకు ఆడటం ఓ సవాలే. మరి మెస్సి ఫిఫా వరల్డ్ కప్ను ముద్దాడి ఆటకు వీడ్కోలు పలుకుతాడో లేదో చూడాలి..