ఆకుపచ్చగా మారిన ఆకాశం : వణికిపోయిన టర్కీ వాసులు

ఆకుపచ్చగా మారిన ఆకాశం : వణికిపోయిన టర్కీ వాసులు

ఉల్కలు, కొన్ని నక్షత్రాలు ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటాయి. సెప్టెంబరు 2వ తేదీ శనివారం సాయంత్రం, టర్కీలో ఒక ఉల్కాపాతం ఆకాశంలో మెరుస్తూ ఆకుపచ్చ రంగును వెదజల్లడంతో  అద్భుతమైన సంఘటన జరిగింది. టర్కీలోని ఎర్జురం సిటీ, గుముషానే ప్రావిన్స్‌లో ఈ అసాధారణ దృశ్యానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యాయి.

ఈ అసాధారణమైన ఉల్కాపాతాన్ని చూసిన యూజర్స్  Xలో పలు వీడియోలను వదిలారు. ఈ క్లిప్‌లలో ఒక వ్యక్తి వీధుల్లో డ్రైవింగ్ చేస్తుండగా రాత్రిపూట ఆకాశంలో అకస్మాత్తుగా ఒక ఆకుపచ్చ కాంతి బంతిగా విస్ఫోటనం చెందడం కనిపించింది. అది ఆ తర్వాత ఒక గీతగా మారింది, దాదాపుగా రెప్పపాటులోనే ఆకాశం అంతటా విస్తరిస్తూ అగుపించింది.

మరొక క్లిప్‌లో, ఓ మైదానంలో కొంతమంది వ్యక్తులు సంబరాలు చేసుకుంటున్నారు. వారు ఒకరి చేతులు మరొకరు పట్టుకుని వృత్తాలుగా నృత్యం చేస్తున్నారు. అకస్మాత్తుగా, ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా, ఉల్కాపాతం ఆకాశంలో కనిపించింది. ఆకాశంలో ఆకుపచ్చ రంగులో ఓ కాంతి కనిపించింది. ఇది చూసిన వారు తమ డ్యాన్స్‌ను ఆపి, ఏం జరిగిందో చూడడానికి తెలుసుకోలేక ఆశ్చర్యపోయారు. ఇక ఈ రకంగా షేర్ అయిన పలు వీడియోలకు నెటిజన్లు కూడా తమ రీతిలో కామెంట్లు పెడుతున్నారు. “నేను నా జీవితంలో మొదటిసారి చూశాను, అది భయంకరంగా ఉంది” అని ఒకరు అనగా.. "నేరుగా మా మార్వెల్ సినిమాల నుంచి ఇది బయటపడింది" అంటూ మరొకరు చమత్కరిస్తూ రాసుకువచ్చారు.