
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో గురువారం వడగండ్ల వాన కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. ముషీరాబాద్, తార్నాక తదితర ప్రాంతాల్లో వడగండ్లు పడ్డాయి. బన్సీలాల్ పేట్, ముషీరాబాద్, మోండా మార్కెట్, వెస్ట్ మారేడ్ పల్లి, గుడిమల్కాపూర్, నాంపల్లి, సికింద్రాబాద్, పార్శిగుట్ట, అంబర్ పేట, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా.. కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, హిమాయత్ నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో మోస్తరు వాన పడింది. న్యూబోయిగూడ వైజంక్షన్ సమీపంలో వర్షం ధాటికి చెట్టు కూలి ప్రహరీపై పడింది. దీంతో గోడ, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. బంజారాహిల్స్ లోటస్ పాండ్ నుంచి అపోలో వెళ్లే రూట్లోనూ చెట్టు కూలింది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. తార్నాక, నాచారం, మల్లాపూర్, లంగర్ హౌస్, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో కరెంట్ కట్ అయింది.
జిల్లాల్లోనూ భారీ వర్షం..
రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షం కురిసింది. కొన్నిచోట్ల వడగండ్ల వాన పడింది. భువనగిరి, నల్గొండ జిల్లాల్లో వడగండ్ల వాన పడగా.. ములుగు, ఆసిఫాబాద్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నిర్మల్, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి, మంచిర్యాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ములుగు జిల్లా కన్నాయిగూడెంలో అత్యధికంగా 8.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
ఇయ్యాల, రేపు వడగండ్లు..
మరో మూడ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని, శుక్ర, శనివారాల్లో వడగండ్ల వాన పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శుక్ర, శనివారాలకు ఆరెంజ్ అలర్ట్, ఆదివారానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా, కొన్ని జిల్లాల్లో మాత్రం ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. నిజామాబాద్ జిల్లా మెండోరాలో 42.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఎర్గట్లలో 42.3, నర్సాపూర్‌లో 42, భైంసాలో , నిజామాబాద్ నార్త్‌లలో 41.8, ఘనపూర్(నల్గొండ)లో 41.6, నేలకొండపల్లి, పాల్దాలలో 41.5, దస్తూరాబాద్, ముప్కల్లలో 41.4 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డయ్యాయి.
ఎక్కడెంత వర్షం పడిందంటే..
ప్రాంతం వర్షం (సెం.మీ.)
బన్సీలాల్ పేట్ 4.5
ముషీరాబాద్ 3.8
మోండా మార్కెట్ 3.7
వెస్ట్ మారెడ్ పల్లి 3.2
గుడిమల్కాపూర్ 3.2
ఓయూ 3.1
నాంపల్లి 3.0
సికింద్రాబాద్ 2.9