మరో రెండు రోజులు అత్యంత భారీ వర్షాలు

మరో రెండు రోజులు అత్యంత భారీ వర్షాలు

రాష్ట్రంలో  ముసురుపట్టి చల్లటి వెదర్ కొనసాగుతోంది. హైదరాబాద్ తో సహా జిల్లాల్లో మూడ్రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు... భారీ వర్షాలు పడుతున్నాయి. 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. అల్పపీడనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. వెదర్ ఆఫీసర్లు. మరో రెండు రోజులపాటు అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలైన నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అత్యంత భారీవర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. 14 జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది వాతావరణ శాఖ.

ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో పలుచోట్ల కుండపోత వాన పడింది. వాగులు, వంకలు ఉప్పొంగాయి. కాలనీలు నీట మునిగాయి. రోడ్లు జలమయమయ్యాయి.  శ్రీరాంపూర్, మందమర్రి సింగరేణి  ఏరియాల్లో మూడ్రోజులుగా  ఎడతెరపి లేకుండా  వర్షం కురుస్తోంది. శ్రీరాంపూర్, ఇందారం,  కళ్యాణి ఖని,   ఆర్కే ఓపెన్ కాస్ట్ ల్లో  ఓబీ పనులు ఆగిపోవడంతో..  75 వేల  టన్నుల  బొగ్గు ఉత్పత్తికి  ఆటంకం ఏర్పడింది. 


కామారెడ్డి నియోజకవర్గంలోని  కామారెడ్డి, మాచారెడ్డి,  దోమకొండ, బిక్నూర్  మండలంలో రాత్రి నుంచి కంటిన్యూగా  వర్షం పడుతూనే  ఉంది. నిజామాబాద్ జిల్లా  భీంగల్ మండలంలోని  జక్లాత్ ఒర్రె రోడ్డుపై  నుంచి  ప్రవహిస్తుంది. ఎరగట్ల  మండలంలోని  తీగల వాగు  రోడ్డు పై నుంచి పొంగిపొర్లుతుంది. దీంతో ఎరుగట్ల , మెట్ పల్లి వైపు  నుంచి రాకపోకలు  నిలిచిపోయాయి. భీంగల్ లోని  కప్పలవాగు   చెక్ డ్యామ్ పొంగి  ప్రవహిస్తోంది. మంథని  మాతా శిశు హాస్పిటల్ చుట్టూ, ఆర్టీసీ  బస్టాండ్ ఆవరణలో  వర్షపు నీరు నిలిచిపోయింది. ఉమ్మడి  నిజామాబాద్ జిల్లాను  వర్షాలు ఆగమాగం  చేస్తున్నాయి. నవీపేట మండలం  లింగాపూర్ గ్రామంలో  తుంగిని మాటు  కాలువకు గండి పడింది.  దీంతో పంటపొలాలకు  నీరు వెళ్తుంది. తాడ్వాయి మండలం  బ్రాహ్మణపల్లిలో వాగు  ఉధృతంగా ప్రవహిస్తుంది.  బ్రాహ్మణపల్లి, టేక్రియాల్, చందాపూర్ , కాలోజివాడి , సంగోజివాడి,  తాడ్వాయి గ్రామాలకు రాకపోకలు  నిలిచిపోయాయి. దీంతో గ్రామస్తులు  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కరీంనగర్ జిల్లాలో  విస్తారంగా వర్షాలు  కురుస్తున్నాయి. రాత్రి  నుంచి కురుస్తున్న వర్షాలతో  రైతులు సంతోషం  వ్యక్తం చేస్తున్నారు.  మరో వైపు  లోతట్టు ప్రాంతాలు  జలమయమయ్యాయి. దీంతో జనాలు  తీవ్ర  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  కరీంనగర్ లోని  అనేక కాలనీల్లో  జనం బయటకు రాలేని  పరిస్థితి ఏర్పడింది . భగత్ నగర్,  కట్టారాంపూర్  ఏరియా, విద్యానగర్, మంకమ్మతోట, పోలీస్  ట్రైనింగ్ కాలేజీ  ఏరియాల్లో భారీగా  వరద నీరు  చేరింది. మున్సిపల్  కార్పోరేషన్ ఏరియాలో చాలా  చోట్ల  డ్రైనేజీలు పూర్తి  కాకపోవడంతో  ప్రజలు అవస్థలు  పడుతున్నారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది.   దీంతో రోడ్లన్ని జలమయమయ్యాయి. పలు చోట్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సిరిసిల్లలోని పాత బస్టాండ్ తో పాలు పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేములవాడ హన్మజిపేట దగ్గర నక్క వాగు పొంగిపోర్లుతుంది. భారీ వర్షాలతో జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పిల్లల్ని నదులు వాగుల దగ్గరకు వెళ్లకుండా చూసుకోవాలన్నారు. ప్రమాదకర పరిస్థితులు ఏర్పడితే వెంటనే డైల్ 100 కు సమాచారం అందించాలన్నారు.