- ఎస్బీఐతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
- ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకున్నా లబ్ధి
ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సుమారు 3,800 మందికి పైగా ఎఫ్‌టీఈ, కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలకు భారీ ఆర్థిక భద్రత చేకూరనున్నది. ప్రతి ఉద్యోగికి వారి వేతనం ఆధారంగా రూ.40 లక్షల నుంచి రూ.1.10 కోట్ల వరకు ఉచిత వ్యక్తిగత, ప్రమాద బీమా కల్పించనున్నారు.
హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) కింద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి భారీ ఊరట లభించింది. సుమారు 3,800 మందికి పైగా ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయ్(ఎఫ్‌టీఈ), కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలకు భారీ ఆర్థిక భద్రత చేకూరనున్నది.
ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ప్రత్యేక ఒప్పందం ప్రకారం, ప్రతీ ఉద్యోగికి వారి వేతనం ఆధారంగా రూ.40 లక్షల నుంచి రూ.1.10 కోట్ల వరకు ఉచిత వ్యక్తిగత, ప్రమాద బీమా సౌకర్యం కల్పించనున్నారు.
దీని కోసం ఉద్యోగి, ప్రభుత్వం ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఎస్బీఐ కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ (సీఎస్పీ) పథకం, స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీ (ఎస్జీఎస్పీ) పథకం కింద ఈ ప్రయోజనాన్ని అందిస్తున్నది. విధి నిర్వహణలో లేదా ఇతరత్రా ఏదైనా ప్రమాదం జరిగి సదరు ఉద్యోగి మరణిస్తే, వారి కుటుంబానికి ఈ బీమా సొమ్ము అండగా నిలుస్తుంది.
ప్రతి నెలా రూ.24 కోట్ల వేతనాలు
ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, రెగ్యులర్ ఉద్యోగులకు ప్రతి నెలా సుమారు రూ.24 కోట్ల మేర వేతనాల చెల్లింపులు జరుగుతున్నాయి.
ప్రస్తుతం ఉన్న సిబ్బందిలో దాదాపు 70 శాతం మంది ఉద్యోగుల వేతన ఖాతాలు ఇప్పటికే ఎస్బీఐలోనే ఉండడంతో, వారికి ఈ బీమా సౌకర్యం తక్షణమే వర్తించనున్నది. మిగిలిన ఉద్యోగులు తమ ఖాతాలను అనుసంధానించుకోవడం ద్వారా ఈ భారీ బీమా రక్షణను పొందే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఉద్యోగుల శాలరీ ఖాతాల ద్వారా పెద్దమొత్తంలో బ్యాంకులో డబ్బులు జమ అవుతాయి కాబట్టి బ్యాంకులు ఇలాంటి పథకాలను తీసుకొస్తున్నట్టు ఆర్థికరంగ నిపుణులు పేర్కొన్నారు.

