న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని ఎయిర్‌పోర్టుల్లో ఇమిగ్రేషన్ ప్రాసెస్ సెకన్లలో పూర్తయ్యేలా 'ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్(ఎఫ్టీఐటీటీపీ)' ప్రోగ్రామ్‌ను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విధానాన్ని ఇప్పటికే ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. అక్కడ సక్సెస్ కావడంతో దేశంలోని 20 ప్రధాన నగరాల్లోనూ ఈ విధానమే తీసుకొస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ విధానం వల్ల ఇమిగ్రేషన్ ప్రక్రియ సెకన్ల నుంచి గరిష్టంగా 30 నిమిషాల్లోనే పూర్తవుతుందని తెలిపారు.
బయోమెట్రిక్స్ ముందుగా ధ్రువీకరించిన ప్రయాణికుల రాకపోకలకు ఇమిగ్రేషన్ ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని వివరించారు. ఈ ప్రోగ్రామ్‌ను త్వరలో కొత్తగా ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్, అహ్మదాబాద్ విమానాశ్రయాలకు విస్తరిస్తున్నారు. అనంతరం దేశవ్యాప్తంగా 21 విమానాశ్రయాలలో అందుబాటులోకి తేనున్నారు. ' విమాన ప్రయాణాలను మరింత సులభతరం చేయడానికి.. ప్యాసింజర్లు శ్రమ లేకుండా ట్రావెల్ చేయడానికి ఈ కార్యక్రమం ప్రవేశపెట్టాం. ఇకపై ఇమిగ్రేషన్ కోసం గంటలు గంటలు క్యూలో నిరీక్షించే అవసరం ఉండదు.
ముందస్తు బయోమెట్రిక్ పూర్తిచేసుకున్న భారతీయులు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) కార్డు హోల్డర్లకు సెకన్లలోనే ఇమిగ్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. వేగవంతమైన, సురక్షితమైన ఇమిగ్రేషన్ క్లియరెన్స్‌తో అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం చేయడమే మా ప్రధాన లక్ష్యం. ఈ విధానం ఢిల్లీ విమానాశ్రయంలో విజయవంతమైంది. 18,400 మంది ప్రయాణికులు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు' అని అధికారులు పేర్కొన్నారు.