IPL 2024: ఆర్‌సీబీ బౌలర్లకు ప్రపంచ స్థాయి గుర్తింపు.. స్పందించిన జమైకన్ స్ప్రింటర్

IPL 2024: ఆర్‌సీబీ బౌలర్లకు ప్రపంచ స్థాయి గుర్తింపు.. స్పందించిన జమైకన్ స్ప్రింటర్

120 బంతుల్లో 197 పరుగులు.. ఎంత చిన్న వేదికైనా టీ20ల్లో ఇదేం కాపాడుకోలేనంత తక్కువ టార్గెట్ ఏమీ కాదు. కానీ, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) బౌలర్లకు ఇది కూడా సరిపోలేదు. అంత పేలవంగా బౌలింగ్ చేశారు. 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్‌ బ్యాటర్లు 93 బంతుల్లోనే చేధించారంటే.. ఆర్‌సీబీ బౌలింగ్  ఏ స్థాయిలో అర్థం చేసుకోవచ్చు. వీరి పుణ్యమా అని ఆ ఫ్రాంచైజీ అంతర్జాతీయ ఖ్యాతి గడించింది.

18 ఫోర్లు,.. 15 సిక్సర్లు

నిజానికి ఆర్‌సీబీ బౌలింగ్‌ యూనిట్‌లో ఏమాత్రం పస లేదు. వికెట్ సంగతి దేవుడెరుగు.. కనీసం పరుగులు కట్టడి చేయగల బౌలర్ కూడా ఆ జట్టులో కనిపించట్లేదు. 196 పరుగుల లక్ష్యాన్ని ఆర్‌సీబీ బౌలర్లు కాపాడుకోలేరని.. అంబానీ జట్టు బ్యాటింగ్ మొదలుపెట్టిన తొలి 20 నిమిషాల్లోనే తెలిసిపోయింది. ముంబై ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌ (34 బంతుల్లో 69, 7 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (24 బంతుల్లో 38, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించారు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాటర్‌ అదే అనుసరించారు.

ఇంత చెత్త బౌలింగ్ అనుకోలే..!

ఈ మ్యాచ్‌లో కిషన్, రోహిత్‌లది తుఫాన్ అయితే, సూర్య ఇన్నింగ్స్ ఒక సునామీ. వచ్చీరాగానే నలుమూలలా బౌండరీలు బాదుతూ 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. అతను కొట్టే షాట్లు చూసి జమైకన్ స్ప్రింటర్ యోహాన్ బ్లేక్ కూడా ఆశ్చర్యపోయాడు. సూర్య అలా కొట్టారంటే .. ఆ రకంగా బంతులేసిన ఆర్‌సీబీ బౌలర్ల నైపుణ్యంపై అతను విమర్శలు గుప్పించాడు.   

"సూర్యకుమార్ యాదవ్ మంచిగా బ్యాటింగ్ చేయగలడని నాకు తెలుసు. కానీ, ఆర్‌సీబీ బౌలర్లు ఇంత చెడ్డ బౌలింగ్ వేస్తారని తెలియదు.." అని బ్లేక్ ట్వీట్ చేశాడు. ఇతని ట్వీట్ చూశాక.. ఆర్‌సీబీ బౌలింగ్‌ యూనిట్ పై నెట్టింట పెద్ద చర్చే జరుగుతోంది. ఇతర ప్రాంచైజీల అభిమానులు పోస్ట్ చేస్తున్న మీమ్ లకు.. ఆర్‌సీబీ ఫ్యాన్స్ తలెత్తుకోలేకపోతున్నారు.